ఓటీటీ ప్రేక్షకులకు పండగే

ఈ వారం థియేటర్లలో కాస్త సందడి నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘భైరవం’ ఓ మోస్తరు అంచనాలతో విడుదలవుతోంది. ఇది కాకుండా ‘షష్ఠిపూర్తి’ అనే చిన్న సినిమా ఒకటి వస్తోంది. ఐతే ఈ సినిమాలకు ఓటీటీల నుంచి ముప్పు తప్పేలా లేదు. ఈ వారం వివిధ భాషల్లో క్రేజీ చిత్రాలు రిలీజవుతుండడమే అందుక్కారణం. భాషతో సంబంధం లేకుండా ఆ చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ వారం రాబోతున్న చిత్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తుడరుమ్’. థియేటర్లలో అద్భుత స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కోసం దక్షిణాది ప్రేక్షకులందరూ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈచిత్రం అనుకున్న దాని కంటే ఒక వారం ఆలస్యంగా రిలీజవుతోంది. ఈ సినిమా శుక్రవారం నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

దాని కంటే ఒక రోజు ముందే, అంటే ఇవాళ్టి నుండే నాని చిత్రం ‘హిట్-3’ని స్ట్రీమ్ చేయబోతోంది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా కూడా థియేటర్లలో బాగానే ఆడింది. నాని సినిమా అంటే తెలుగు వాళ్లే కాక ఇతర భాషల వాళ్లూ ఆసక్తి ప్రదర్శిస్తారు. అతడి సినిమాలకు భారీగా వ్యూయర్‌షిప్ ఉంటుంది. ‘హిట్-3’ రిలీజైన మే 1నే విడుదలైన సూర్య సినిమా ‘రెట్రో’ కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రం తమిళంలో ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. తెలుగులో ఫ్లాప్ అయింది. కానీ సూర్య సినిమా అంటే ఫలితం ఎలా ఉన్నా.. ఓటీటీలో ప్రేక్షకులు బాగానే చూస్తారు. ఈ చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థే రిలీజ్ చేస్తోంది. ‘రెట్రో’ ఈ నెల 30న స్ట్రీమింగ్‌కు దరాబోతోంది.

ఇక ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో చిత్రం.. టూరిస్ట్ ఫ్యామిలీ. స్టార్లు లేకపోయినా.. కొత్త దర్శకుడు పరిమిత బడ్జెట్లో రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఘనవిజయాన్నందుకుంది. ఏకంగా రూ.80 కోట్ల వసూళ్లతో.. ‘రెట్రో’ను అధిగమించింది. ఈ చిత్రాన్ని జూన్ 2న జియో హాట్ స్టార్‌లో డిజిటల్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నాలుగు చిత్రాలూ బహు భాషల్లో ఆదరణ పొందే అవకాశమున్నవే.