మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘కన్నప్ప’ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ ప్రభాస్ అనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయిందంటే ప్రభాస్ ప్రత్యేక పాత్ర చేయడం కారణం. బిజినెస్ పరంగానూ ఈ సినిమాకు ప్రభాస్ అతి పెద్ద బలమయ్యాడు. ప్రభాస్ ఈ సినిమా చేసిన సాయం సామాన్యమైనది కాదని.. అతడికి ఎప్పుడూ రుణపడి ఉంటానని హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూనే ఉన్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు చెప్పుకోదగ్గ నిడివే ఉందని.. అతను అరగంట పాటు కనిపిస్తాడని ఇటీవలే విష్ణు వెల్లడించడంతో అభిమానులు చాలా ఆనందపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా చూడ్డానికి అంతకుమించిన కారణం అవసరం లేదు. మరి అంత నిడివి ఉన్న పాత్రను చేయడానికి ప్రభాస్ ఎంత పారితోషకం తీసుకుని ఉంటాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాలో నటించడం విశేషం. ఐతే ప్రభాస్‌కు మంచు ఫ్యామిలీ రెమ్యూనరేషన్ ఇవ్వొద్దనేమీ అనుకోలేదట. విష్ణు అందుకోసం గట్టిగానే ప్రయత్నించాడట.
ఐతే విష్ణు ఎప్పుడు ఆ విషయం ఎత్తినా ప్రభాస్ దాటవేస్తూ ఉండేవాడట. దీంతో ఇక లాభం లేదని.. మోహన్ బాబు దగ్గరికి వెళ్లి ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి అడగమని విష్ణు చెప్పాడట. నేను మాట్లాడతా అని చెప్పిన మోహన్ బాబు.. ప్రభాస్ దగ్గరికెళ్లి పారితోషకం గురించి ప్రస్తావిస్తే.. ఇంకోసారి ఈ మాట ఎత్తితే విష్ణును చంపేస్తానని చెప్పండి అని అన్నాడట ప్రభాస్. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్.. స్థాయికి ఈ సినిమాలో నటించడమే గొప్ప అని.. అతను అడిగితే ఎంతైనా ఇవ్వడానికి తాను సిద్ధమని.. కానీ మోహన్ బాబుతో ఉన్న స్నేహం, ఆయన మీదున్న గౌరవంతో ఈ సినిమాలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించాడని విష్ణు తెలిపాడు. అందుకే తాను జీవితాంతం ప్రభాస్‌కు రుణపడి ఉంటానన్నాడు.
ఇక మోహన్ లాల్ సైతం ఈ సినిమాకు పైసా తీసుకోలేదని విష్ణు వెల్లడించాడు. మీ మేనేజర్‌తో మాట్లాడాలి అని అంటే.. ఎందుకు మేనేజర్, నాతోనే మాట్లాడు అని మోహన్ లాల్ అన్నారని.. అప్పుడు రెమ్యూనరేషన్ గురించి ప్రస్తావిస్తే.. నాకు డబ్బులిచ్చేంత పెద్దవాడివి అయిపోయావా అని ఆయన తిట్టినట్లు విష్ణు తెలిపాడు. అక్షయ్ కుమార్ మాత్రం ఈ సినిమాకు పెద్ద మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నాడని.. కానీ మామూలుగా ఆయన తీసుకునేదాంతో పోలిస్తే అది తక్కువే అని విష్ణు వెల్లడించాడు.