త్రివిక్రమ్ చేతికి రామ్ చరణ్ 18 ?

టాలీవుడ్ లో ఊహించని కాంబినేషన్లు తెరమీదకొస్తున్నాయి. అధికారిక ప్రకటనలు రానప్పటికీ తెరవెనుక వస్తున్న లీకులు విశ్వసనీయంగా ఉండటంతో అభిమానుల అంచనాలు ఇంకా పట్టాలు ఎక్కక ముందే పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ 22 కి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్ తో ఒక సినిమా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి రిలీజ్ లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని సమాచారం. జూన్ 6 దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రావొచ్చని అంటున్నారు కానీ ఓపెనింగ్ ఇంకొంచెం లేట్ అవ్వొచ్చట.

ఇదిలా ఉండగా దీని తర్వాత త్రివిక్రమ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటూ వస్తున్న రామ్ చరణ్ మూవీని టేకప్ చేయబోతున్నట్టు ఫ్రెష్ అప్డేట్. పెద్ది అయ్యాక సుకుమార్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లేందుకు కొంచెం ఎక్కువ సమయం పట్టేలా ఉందట. ఆలోగా త్రివిక్రమ్ చరణ్ కాంబోని ఫినిష్ చేసే అవకాశాలను హారికా హాసిని సంస్థ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ కార్యరూపం దాలిస్తే మెగా ఫ్యాన్స్ కి అంత కన్నా గుడ్ న్యూస్ ఉండదు. కాకపోతే ఇది ఆర్సి 17 లేదా ఆర్సి 18 అవుతుందా అనేది తేలాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. చరణ్ కోసం మంచి స్టోరీ లైన్ అయితే త్రివిక్రమ్ దగ్గర సిద్ధంగా ఉందట.

ప్రస్తుతం రామ్ చరణ్ దుబాయ్ లో ఉన్నాడు. సుకుమార్ స్క్రిప్ట్ డిస్కషన్స్ తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ఇక్కడే జరగొచ్చని అంటున్నారు. ఇవి కాకుండా తనతో ఎప్పటి నుంచో మూవీ ప్లాన్ చేస్తున్న హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో మీటింగ్ ఉందని అనఫీషియల్ గా వినిపిస్తున్న లీక్. దాని దర్శకుడు, స్కేల్ వగైరా వివరాలన్నీ గుట్టుగా ఉంచుతున్నారు. అనవసరంగా గేమ్ ఛేంజర్ కోసం మూడేళ్లు వృథా చేసుకున్న రామ్ చరణ్ స్పీడ్ పెంచే పనిలో ఉన్నాడు. పెద్దిని నవంబర్ లోగా పూర్తి చేసి ఆపై కొత్త సినిమాలకు సంబంధించిన పనులు చూసుకునే ఆలోచనలో ఉన్నాడు.