హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలతో పాటు బోలెడు విశేషాలున్నాయి. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ లో మంచు మనోజ్ మెయిన్ విలన్ గా నటించాడు. తొలుత ఆగస్ట్ 1 విడుదల చేయాలని ప్రకటన ఇచ్చినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు మరికొంత భాగం షూట్ బ్యాలన్స్ ఉండటంతో సెప్టెంబర్ 5 కి వాయిదా వేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటనతో కూడిన టీజర్ ని టీమ్ లాంచ్ చేసింది. మిరాయ్ ప్రపంచాన్ని చూపించింది.
అశోకుడి కాలంలో నెరవేరకుండా మిగిలిపోయిన ఒక సంకల్పం వెనుక దుష్టశక్తి ఉంటుంది. కలియుగంలో మనిషి (మంచు మనోజ్) రూపం తీసుకుని వినాశనానికి పూనుకుంటుంది. అతన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. మిరాయ్ అనే దివ్యశక్తులున్న ఆయుధం వల్లే లోక కళ్యాణం జరుగుతుందని సాధువులు గుర్తిస్తారు. దాని కోసమే పుట్టిన ఓ యువకుడు (తేజ సజ్జ) మిరాయ్ చేత బట్టుకుని తన బలం తనకు తెలియని హనుమంతుడిలా తొమ్మిది పుస్తకాల్లోని రహస్యాల కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ప్రాణాంతకమైన ఈ వేటలో అతను చేసిన సాహసాలు, చేరుకున్న గమ్యం ఏమిటన్నదే మిరాయ్.
విజువల్స్ ఊహకందనంత రిచ్ గా ఉండటం మిరాయ్ ఇచ్చిన మెయిన్ సర్ప్రైజ్. తెరమీద అరుదుగా చూసే కల్కి లాంటి ఫాంటసీ ప్రపంచాన్ని ఇంకో కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు కార్తీక్ ఘట్టమనేని. విఎఫ్ఎక్స్ క్వాలిటీ, గౌరా హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తదితరాలన్నీ గ్రాండ్ గా ఉన్నాయి. జయరాం, శ్రేయ శరన్, జగపతిబాబు తదితరుల గెటప్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. తేజ సజ్జ హీరోయిజం, మనోజ్ విలనీ అవతారం ప్రత్యేక ఆకర్షణలుగా నిలవబోతున్నాయి. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపడంలో మిరాయ్ బృందం నూటికి నూరు మార్కులు సాధించింది. వాటిని నిలబెట్టుకుంటే తేజ సజ్జకు మరోమైలురాయి ఖాయమే.