టాలీవుల్లో ప్రస్తుతం మాంచి ఊపుమీదున్న కమెడియన్ ఎవరంటే.. సత్య పేరే చెప్పాలి. ఒక ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉన్న సత్య.. సరైన పాత్ర పడితే ఎలా చెలరేగిపోతాడో చాలా సినిమాలు రుజువు చేశాయి. ‘మత్తు వదలరా-2’ తన కెరీర్‌కు పెద్ద మలుపు అని చెప్పాలి. ఆ సినిమా పెద్ద హిట్ కావడంలో అత్యంత కీలక పాత్ర సత్యదే. తన కామెడీనే సినిమాను డ్రైవ్ చేసింది. కానీ తర్వాత సత్యకు సరైన పాత్రలు పడట్లేదనే అసంతృప్తి ప్రేక్షకుల్లో వ్యక్తమైంది.
ఐతే ఇప్పుడు సత్య కామెడీ టైమింగ్‌ను పూర్తిగా వాడుకునే ఒక క్యారెక్టర్ అతడికి దక్కినట్లే కనిపిస్తోంది. అదే.. బెట్టింగ్ భోగి. ఐతే ఈ పాత్ర సినిమాలోనిది కాదు. సత్య తొలిసారిగా నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లోనిది. అదే.. 3 రోజెస్2. ఆహా ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ నుంచి సత్య క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ తాలూకు దుష్పరిణామాల గురించి ఈ మధ్య ఎంత పెద్ద చర్చ జరిగిందో తెలిసిందే. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ మీద ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో బెట్టింగ్‌కు బానిసైన ఓ కుర్రాడి పాత్రను సత్య కోసం తీర్చిదిద్దారు.
ఐతే టాపిక్ సీరియస్ అయినా.. దాన్ని సత్య టైమింగ్‌కు తగ్గట్లు భలే ఫన్నీగా తీర్చిదిద్దారు. ఓ మంచి సందేశాన్ని ఒక కామెడీ క్యారెక్టర్ ద్వారా చెబితే జనాలకు బాగా ఎక్కుతుందనడంలో సందేహం లేదు. ట్రెండీ మీమ్స్‌ను వాడుకుంటూ ఈ పాత్రను చాలా ఫన్నీగా తీర్చిదిద్దినట్లున్నారు మేకర్స్. రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్లో సత్య ప్రతి పంచ్ పేలింది. తన పాత్ర హిలేరియస్‌గా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చింది టీజర్. ‘3 రోజెస్’ ఫస్ట్ సీజన్ ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. కానీ రెండో సీజన్‌ను కేవలం సత్య కోసమే జనం చూసేలా ఉన్నారు. అంత ఇంట్రెస్టింగ్‌గా టీజర్ కట్ చేసింది టీం.