తుడ‌ర‌మ్.. ఓటీటీ డేట్ వ‌చ్చేసింది

మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండే హీరో.. మోహన్ లాల్. నెల రోజుల వ్య‌వ‌ధిలో ఆయ‌న సినిమాలు రెండు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముందుగా మార్చి నెలాఖ‌ర్లో భారీ అంచనాల మ‌ధ్య వ‌చ్చిన ఎల్-2 ఎంపురాన్ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా ఇండ‌స్ట్రీ హిట్ అయింది. ఆ త‌ర్వాత నెల రోజుకే తుడ‌రుమ్ పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా విడుద‌లై అదిరిపోయే టాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. కేర‌ళ‌లో వంద కోట్ల వ‌సూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఇది రికార్డు నెల‌కొల్ప‌డం విశేషం. మొత్తంగా ఇప్ప‌టిదాకా రూ.230 కోట్ల వ‌సూళ్ల‌తో టాప్-3 మ‌ల‌యాళ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇంకా ఆ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ కొన‌సాగుతోంది.

‘తుడరుమ్’ను ముందు ఈ నెల మూడో వారంలోనే ఓటీటీలో రిలీజ్ చేయాల్సింది. కానీ థియేట‌ర్ల‌లో ఈ సినిమా అద‌ర‌గొడుతుండ‌డంతో ఒక వారం డిజిట‌ల్ రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా ఓటీటీ డేట్‌ను టీం అనౌన్స్ చేసింది. ఈ నెల 30 నుంచి జియో హాట్ స్టార్ ద్వారా ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ మ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌ను ఆ భాష వాళ్లే కాక దేశ‌వ్యాప్తంగా బాగా చూస్తున్నారు. తెలుగు వాళ్ల‌యితే మ‌ల‌యాళ చిత్రాల‌కు ప‌ట్టం క‌డుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి హిట్ చిత్రాల వివ‌రాలు తెలుసుకుని ఓటీటీ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అలా ఎక్కువ వెయిట్ చేస్తున్న సినిమా.. తుడరుమ్ అనే చెప్పాలి. ఈ సినిమాకు అదిరిపోయే రివ్యూలు వ‌చ్చాయి. మౌత్ టాక్ కూడా అదిరిపోయింది.

నిజానికి తుడ‌రుమ్‌ను తెలుగులో కూడా రిలీజ్ చేసిన‌ప్ప‌టికీ థియేట‌ర్ల‌కు వెళ్లి జ‌నం పెద్ద‌గా చూడలేదు. వారం రోజుల ర‌న్ త‌ర్వాత సినిమాను థియేట‌ర్ల నుంచి తీసేశారు. ఓటీటీలో సినిమా చూసేందుకు మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది దృశ్యం త‌ర‌హా థ్రిల్ల‌ర్ మూవీనే. ఇందులో మోహ‌న్ లాల్ ట్యాక్సీ డ్రైవ‌ర్ పాత్ర పోషించాడు. ఆయ‌న‌కు జోడీగా అల‌నాటి న‌టి శోభ‌న న‌టించింది. హీరో అనుకోకుండా ఓ స‌మ‌స్య‌లో చిక్కుకోవ‌డం, అంత‌లో కొడుకు కిడ్నాప్ అవ‌డం.. ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం.. ఈ నేప‌థ్యంలో ఉత్కంఠ‌భ‌రితంగా ఈ సినిమా సాగుతుంది.