దీపికా పదుకునేని వద్దనుకున్నాక స్పిరిట్ హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా త్రిప్తి డిమ్రిని ఎంచుకోవడం బయటి వాళ్ళకేమో కానీ ఫ్యాన్స్ కి మాత్రం షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఎలా చూసుకున్నా ఆమె ప్రభాస్ రేంజ్ కాదు. ఆ మాటకొస్తే యానిమల్ లో చేసింది, గుర్తింపు వచ్చింది కూడా బోల్డ్ కంటెంట్ వల్ల కానీ పెర్ఫార్మన్స్ ద్వారా కాదనేది అధిక శాతం వ్యక్తం చేసే అభిప్రాయం. మరి స్పిరిట్ లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో ఆమె ఎలా ఫిట్టవుతుందనే ప్రశ్నకు సమాధానం సినిమా చూస్తే కాని దొరకదు. అయితే ముంబై రిపోర్ట్స్ లో వినిపిస్తున్న సమాచారం కొంత ఆసక్తి రేపేలా ఉంది.
వాటి ప్రకారం స్పిరిట్ కూడా సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ తెచ్చుకునే మూవీనే. వయొలెన్స్, రొమాన్స్ లో తనదైన మార్కు చూపించే సందీప్ రెడ్డి వంగా వాటిని ప్రభాస్ సినిమాలో ఇంకా ఎక్కువ డోస్ లో చూపించబోతున్నాడట. ఆ సీన్లు, ఎపిసోడ్లు ముందే హీరోకు వివరించి అవి ఏ సందర్భంలో వస్తాయి, తాను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు తదితరాలన్నీ స్టోరీ బోర్డు రూపంలో వివరించాడని టాక్. చాలా కన్విన్సింగ్ గా అనిపించిన ప్రభాస్ ఎస్ చెప్పినట్టు తెలిసింది. అంటే ఇప్పటిదాకా డార్లింగ్ ని ఏ సినిమాలో చూడనంత బోల్డ్ అండ్ రొమాంటిక్ గా స్పిరిట్ లో చూడొచ్చని అనఫీషియల్ టాక్.
దీని సంగతి పక్కనపెడితే స్పిరిట్ లో ఎలివేషన్లు, పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. పలువురు విదేశీ నటీనటులతో పాటు ఎవరూ ఊహించని ఒక స్టార్ క్యామియో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తుందని అంటున్నారు. ఆ పేరు బయటికి రాలేదు కానీ సమయం వచ్చినప్పుడు లీకైతే మాత్రం సోషల్ మీడియా బద్దలు కావడం ఖాయమంటున్నారు. సో కొంచెం వెయిట్ చేసి చూడాలి. హర్షవర్ధన్ రామేశ్వర్ పాటల కంపోజింగ్ ని దాదాపు కొలిక్కి తెచ్చినట్టు వినికిడి. స్పిరిట్ సిగ్నేచర్ ట్యూన్ సైతం సిద్ధమయ్యిందట. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు వంగా రెడీ.