దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన చేసిన ప్రయోగాలు, అద్భుత పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కమల్ వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఐతే గత దశాబ్దంలో కమల్ అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఆయన సినిమాలు బాగా తగ్గించేశారు. చేసిన ఒకటీ అరా సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు.
శభాష్ నాయుడు, ఇండియన్-2 లాంటి సినిమాలు మధ్యలో ఆగిపోవడమూ అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఇలాంటి సమయంలో కమల్ మళ్లీ ఓ ఎగ్జైటింగ్ ప్రాజెక్టుతో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆ చిత్రమే.. విక్రమ్.
ఖైదీ సినిమాతో గొప్ప పేరు సంపాదించి విజయ్ లాంటి సూపర్ స్టార్‌తో మాస్టర్ లాంటి భారీ చిత్రాన్ని రూపొందించిన లోకేష్ కనకరాజ్‌తో కమల్ జట్టు కట్టబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ వెల్లడిస్తూ టీజర్ రిలీజ్ చేశారు. కమల్ ఇందులో చాలా విభిన్నమైన పాత్ర చేస్తున్నాడని, కథ కూడా సరికొత్తగా ఉంటుందని అర్థమవుతోంది. టీజర్‌ను ప్రెజెంట్ చేసిన తీరులోనూ వైవిధ్యం కనిపించింది.
వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తున్న కమల్.. ఓ హిల్ స్టేషన్లోని ఇంటిలో అతిథుల కోసం ఓవైపు వంట సిద్ధం చేస్తూనే.. మరోవైపు వారిపై దాడి చేసేందుకు ఆయుధాలు సిద్ధం చేయడం.. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక వంటలు వడ్డించి, ఆయుధాలు బయటికి తీయడం.. ఇలా చాలా ఎగ్జైటింగ్‌గా కనిపించింది టీజర్. తన సొంత నిర్మాణ సంస్థలో కమలే ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే వేసవికి విడుదలవుతుంది.