గత వారం రోజులుగా ఇండస్ట్రీని కుదిపేసిన థియేటర్ల బంద్ వ్యవహారం నిన్న ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లేఖతో కొత్త మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. పాలనలోకి వచ్చి ఏడాదైనా కనీసం ఓసారైనా ముఖ్యమంత్రిని కలిసే చొరవ తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్ అంటూ వ్యంగ్యంగా పరిశ్రమ తీరు పట్ల విమర్శించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ రోజు అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనవైపు చెప్పాలనుకున్న విషయాలను వివరించారు. అందులో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకున్న ఆ నలుగురు గురించి.
పదిహేనేళ్లుగా ఆ నలుగురు గురించి హైలైట్ చేస్తూ వస్తున్నారని, కానీ వాళ్ళలో నేను లేనని అరవింద్ కుండ బద్దలు కొట్టేశారు. ఏపీ తెలంగాణలో తనకు థియేటర్లు లేవని, హైదరాబాద్ లో ఉన్న ఏఏఏ తప్ప దేనికీ తాను ఓనర్ ని కానని తేల్చేశారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో పదిహేను కంటే తక్కువ స్క్రీన్లు తనకు లీజులో ఉన్నాయని, ఇకపై వాటిని రెన్యూవల్ చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న టైంలో బంద్ పిలుపు ఇవ్వడం ద్వారా దుస్సాహసం చేశారని చెబుతున్న అరవింద్ పవన్ సూచించినట్టు ఎప్పుడో చంద్రబాబు నాయుడుని కలవాల్సిందని, చేయకపోవడం తప్పేనని అన్నారు.
పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అల్లు అరవింద్ ప్రధానంగా ఆ నలుగురిలో లేనని చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని మార్గాలు మూసుకున్నప్పుడు బంద్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలా హఠాత్తుగా పిలుపు ఇవ్వడం వల్లే తాను మీటింగులకు దూరంగా ఉన్నానని అరవింద్ అన్నారు. ఉపముఖ్యమంత్రి హోదా పవన్ విడుదల చేసిన లేఖలో పాయింట్లను పూర్తిగా సమర్ధిస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఇకపై ఆ నలుగురు కథనాల్లో తన ఫోటో వేయొద్దని కోరారు ఇప్పుడీ మీడియా మీట్ తాలూకు స్పందనలు ఇతర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.