సింహాన్ని కెల‌కొద్దు: బండ్ల గ‌ణేష్ ఎంట్రీ

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సినీ రంగంపై చేసిన విమ‌ర్శ‌లు సెగ‌లు పొగ‌లు కాదు.. ఏకంగా మంటలు పుట్టిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాసిన ఘాటు, సుదీర్ఘ లేఖ‌పై సినీ పెద్ద‌ల స్పంద‌న ఎలా ఉన్నా.. ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న కొంద‌రు మాత్రం రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి వారిలో బ‌న్నీ వాసు.. శ‌నివారం రాత్రే పోస్టు చేయ‌గా.. తాజాగా మ‌రో నిర్మాత‌ నాగ వంశీ కూడా రియాక్ట్ అయ్యారు. సినిమా పెద్ద‌ల మ‌ధ్య ఐక్య‌త లేద‌ని.. సినీ రంగం ఏం చేస్తోందో కూడా అర్ధంకావ‌డం లేద‌ని ఈ ఇద్ద‌రు పేర్కొన్నారు.

ఇక‌, తాజాగా మ‌రో నిర్మాత‌, త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చే బండ్ల గ‌ణేష్ మ‌రింత ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్ కల్యాణ్‌కు అభిమాని కూడా అయిన ఆయ‌న‌.. సినీ పెద్ద‌ల‌ను ఉద్దేశించి.. “సింహాన్ని కెల‌కొద్దు!” అని గట్టిగానే చెప్పుకొచ్చారు. ‘సింహాన్ని దూరంగా ఉండి చూడండి తప్పులేదు. దగ్గరికెళ్లి కెలికారా.. ఇక మీ ఇష్టం’ అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో జతచేసి పోస్ట్ చేశారు. తాజాగా ప‌వ‌న్ రాసిన లేఖ‌.. అదే స‌మయంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్‌కు ముందు హాళ్ల‌ను బంద్ చేస్తామ‌న్న వ్యాఖ్య‌లు ఇండిస్ట్రీలో మంట‌లు రేపాయి.

బండ్ల గ‌ణేష్ రాసిన విష‌యం కూడా.. దాదాపు ప‌వ‌న్‌ను కెల‌కొద్ద‌ని.. ఆయ‌న‌తో స‌ర్దుకుపోయే విధంగా ప‌నిచేయాల‌ని కూడా నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌కు సూచించిన‌ట్టు అయింది. పవన్ సింహంలాంటోదని.. ఆయన్ని కెలికితే ఊరుకోరని గణేష్ క్లారిటీ ఇచ్చేశాడు. కాగా.. ఒక్క మాటే గ‌ణేష్ పేర్కొన్నా.. పదునైన వ్యాఖ్య కావ‌డంతో ఆయ‌న పోస్టుకు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

గ‌తంలోనూ అనేక సంద‌ర్భాల్లో ప‌వ‌న్‌ను స‌మ‌ర్థించిన గ‌ణేష్‌. ఇప్పుడు సినీ రంగానికి చెందిన పెద్ద‌ల‌ను ఉద్దేశించి కూడా కీల‌క వ్యాఖ్య చేసిన‌ట్టు అయింది. మ‌రోవైపు.. ఇప్ప‌టిదాకా.. సినీ రంగానికి చెందిన పెద్ద నిర్మాత‌లు.. అల్లు అర‌వింద్‌, దిల్ రాజు వంటివారు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వారు ఎప్ప‌టికి రియాక్ట్ అవుతారో చూడాలి.