అక్కినేని నాగార్జున నుంచి సోలో హీరోగా సినిమా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. గత సంక్రాంతికి ఆయన నా సామి రంగ మూవీతో పలకరించారు. ఆ తర్వాత హీరోగా సినిమా మొదలుపెట్టనే లేదు. అలా అని ఆయనేమీ నటనకు దూరం అయిపోలేదు. కూలీ, కుబేర అంటూ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటిలో కూలీకి మామూలు క్రేజ్ లేదు. నాగ్ చేస్తున్న పాత్ర మీదా భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్‌లో నాగ్ ముఖం చూపించకుండానే అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్.
కూలీ సినిమాకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగులో బిజినెస్ కూడా అంచనాలకు మించి జరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే నాగ్ నటించిన రెండు చిత్రాల్లో ఆలస్యంగా రిలీజయ్యేది ఇదే. ఆగస్టు 14న కూలీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దానికి రెండు నెలల ముందే కుంబేర విడుదల కావాల్సి ఉంది. ఐతే ఈ చిత్రానికి పెద్దగా హైప్ కనిపించడం లేదు. చాన్నాళ్లుగా ఈ సినిమా అస్సలు వార్తల్లో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
కుబేర మేకింగ్ కూడా చాలా కాలం సాగింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూలీలో కంటే కుబేరలోనే నాగ్ పాత్ర కీలకం. ఆయనకు ఇందులో స్క్రీన్ టైం కూడా ఎక్కువేనట. ఐతే ఇది మాస్ సినిమాలా కనిపించకపోవడంతో బజ్ క్రియేట్ కాలేదు. ధనుస్ హీరో కావడం వల్ల కూడా తెలుగులో హైప్ తక్కువే ఉంది. నాగ్ ప్రమేయం లేకుండానే కూలీకి కావాల్సినంత హైప్ వచ్చింది తెలుగులో.
కానీ ముందు రిలీజ్ కాబోతున్న కుబేరకు బజ్ క్రియేట్ కాలేదు. దీని మీద నాగ్ ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది. ధనుష్ ఈ సినిమాకు తెలుగులో తన వంతుగా క్రేజ్ తీసుకొచ్చేదేమీ లేదు. నాగార్జునే ఈ విషయంలో చొరవ తీసుకుని గట్టిగా ప్రమోట్ చేసి హైప్ పెంచాల్సిన అవసరముంది. అంతకంటే ముందు నాగ్ పాత్ర మీద స్పెషల్ టీజర్ లాంటిది వదలడం.. ఆయనే కేంద్రంగా ప్రమోషన్లు ప్లాన్ చేయడం చాలా అవసరం. అప్పుడే కుబేరకు కావాల్సిన బజ్ వస్తుంది.