పేరుకు తమిళ నటుడే కానీ.. విజయ్ సేతుపతిని ఇతర భాషల వాళ్లు కూడా ఎంతో అభిమానిస్తారు. తెలుగు వాళ్లయితే మన ఆర్టిస్టులాగే చూస్తారు. అతను తెలుగులో నటించడానికి ముందే ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తయారయ్యారు. ఇక సేతుపతి తెలుగులో నటించిన సైరా, ఉప్పెన చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. విజయ్‌ని మనవాళ్లు ఎంతగానో ఓన్ చేసుకున్నారు. గత ఏడాది సేతుపతి ‘మహారాజా’ అనే సినిమా చేశాడు. అది తెలుగులో పెద్దగా బజ్ లేకుండా రిలీజైంది. కానీ విడుదల తర్వాత ఆ చిత్రానికి మన వాళ్లు బ్రహ్మరథం పట్టారు. థయేటర్లలో, అలాగే ఓటీటీలో విశేషమైన ఆదరణ దక్కించుకుందీ చిత్రం.
ఐతే ‘మహారాజా’ తర్వాత సేతుపతి ఏం చేసినా చెల్లిపోతుందని అనుకున్నారో ఏమో కానీ.. తన కొత్త చిత్రం ‘ఏస్’కు సరైన ప్రమోషన్ కూడా చేయకుండా నిన్న థియేటర్లలోకి దించేశారు. ఇందులో కంటెంట్ ఉంటే.. ‘మహారాజా’ లాగే సైలెంట్‌గా జనాల్లోకి వెళ్లిపోయేది. కానీ సరైన కథ లేకుండా.. ఎంగేజింగ్ కథనం లేకుండా.. కేవలం సేతుపతిని ముందు పెట్టి సినిమాను మొక్కుబడిగా లాగించేశారని సినిమా చూస్తేనే అర్థమైంది. రొటీన్ కథను.. బోరింగ్ కథనంతో నడిపించి ప్రేక్షకులకు విసుగు పుట్టించాడు దర్శక నిర్మాత ఆర్ముగ కుమార్. అసలే టాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్‌లో ఉండగా.. ఇలాంటి సబ్ స్టాండర్డ్ సినిమాను ప్రేక్షకులు ఎక్కడ ఆదరిస్తారు?
నిన్న ‘ఏస్’ చిత్రానికి తెలుగులో సరైన ఆక్యుపెన్సీలు లేక షోలే క్యాన్సిల్ అయ్యాయి. షోలు పడ్డ చోట కూడా బ్యాడ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా నెగెటివ్‌గానే వచ్చాయి. కానీ తమిళ మీడియా వాళ్లు మాత్రం ఎప్పట్లాగే ఆహా ఓహో అంటూ ఈ సినిమాకు ఎలివేషన్ ఇస్తున్నారు. 3, 3.5 రేటింగ్స్ ఇస్తున్నారు. కానీ తెలుగు క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాలోని కంటెంట్‌కు తగ్గట్లే రేటింగ్స్, రివ్యూలు ఇచ్చారు. ‘మహారాజా’ పేరు చెప్పి ఈ సినిమాను సేల్ చేసేయాలన్న ప్రయత్నం గట్టిగానే బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది.