-->

ట్రోలింగ్ సెగలు : భైరవం దర్శకుడి సారీ

ఈ నెల 30 విడుదల కాబోతున్న భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల ట్రోలింగ్ బారిన పడ్డారు. ఎప్పుడో దశాబ్దం క్రితం తన సోషల్ మీడియా పేజీలో మెగా హీరోలను అవమానపరిచినట్టుగా కొన్ని స్క్రీన్ షాట్లు బయటికి రావడం మెగాభిమానులకు ఆగ్రహం కలిగించింది. దీంతో బాయ్ కాట్ భైరవం అంటూ ట్రెండింగ్ మొదలుపెట్టారు. దీని వల్ల కలుగుతున్న డ్యామేజ్ పెద్దదవ్వడంతో విజయ్ కనకమేడల స్వయంగా స్పందించారు. ఎవరో హ్యాక్ చేసి ఉద్దేశపూర్వకంగా ఆ పోస్టులను పోస్ట్ చేశారని, ఇప్పుడు వాటితో తన సినిమాను చంపే ప్రయత్నం చేస్తున్నారని సుదీర్ఘమైన సందేశం విడుదల చేశారు.

విజయ్ కనకమేడలకు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కు పని చేసిన అనుభవం ఉంది. సాయి ధరమ్ తేజ్ తో అన్నా అని పిలిపించుకునేంత చనువు ఉంది. తనకు సరిపడా కథ ఉంటే సినిమా చేద్దాం తీసుకురమ్మని సాయి చెప్పడం గురించి ఆయన ప్రస్తావించారు. అంతే కాదు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగిన తాను మెగాభిమానులను దూరం చేసుకునే పనులు ఎందుకు చేస్తానని, కాకపోతే హ్యాక్ జరిగింది నా పేజీలోనే కాబట్టి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ఫ్యాన్స్ ని క్షమాపణ కోరుతూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. హీరోలు దర్శకులు ఇప్పటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సరిపోదు. గతంలో తాము పెట్టిన పోస్టులు ట్వీట్లలో ఏమైనా హ్యాక్స్ జరిగాయా లేక ట్రోలింగ్ అయ్యిందాని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడెప్పుడో పాతవి ఎవరు గుర్తు పెట్టుకుంటారని అనడానికి లేదు. అందరూ మర్చిపోయిన గతాన్ని తవ్వితీసి మరీ ఇలాంటివి బయట పెడుతుంటారు. విజయ్ కనకమేడల అన్నట్టు బాధ్యత మాత్రం సదరు అకౌంట్ హోల్డర్ దే అవుతుంది. దీనికి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. ప్రస్తుతానికి ముగింపు పడినట్టే అనుకోవాలి.