హైందవ… ఇండియాను షేక్ చేసే సినిమా

ఒకప్పుడు విరామం లేకుండా పెద్ద పెద్ద సినిమాలు చేసిన హీరో.. బెల్లంకొండ శ్రీనివాస్. అరంగేట్రమే వి.వి.వినాయక్ లాంటి పెద్ద దర్శకుడు, సమంత లాంటి టాప్ హీరోయిన్‌తో చేసిన శ్రీనివాస్.. ఆ తర్వాత కూడా ఇలా క్రేజీ కాంబినేషన్లలోనే నటించాడు. కానీ గత కొన్నేళ్లలో అతడి జోరు తగ్గింది. వరుస ఫ్లాపులకు తోడు హిందీ మూవీ ‘ఛత్రపతి’ కోసం తెలుగులో బ్రేక్ తీసుకోవడంతో తన పేరు ఇక్కడ పెద్దగా వినిపించలేదు. ఇప్పుడు ‘భైరవం’తో రీఎంట్రీ ఇస్తున్నాడు శ్రీనివాస్. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న శ్రీనివాస్.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు.

లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడితో తాను చేస్తున్న ‘హైందవ’ సినిమా మామూలుగా ఉండదని అంటున్నాడు శ్రీనివాస్. ఈ కథ మీద తాము మూడేళ్లుగా పని చేస్తున్నామని.. ప్రి విజువలైజేషన్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో తమకు అర్థమైపోయిందని శ్రీనివాస్ చెప్పాడు. ఇది చాలా పెద్ద రేంజ్ సినిమా అని.. తన కెరీర్‌కు ఇది గేమ్ చేంజర్ అవుతుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా రిలీజైనపుడు ఇండియా అంతా షేక్ అయిపోతుందని అతను స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు తెరకెక్కనున్న ఈవెంట్ ఫిలిం ఇదని.. దశావతారాల చుట్టూ కథ నడుస్తుందని అతను చెప్పాడు.

ఇక ఇప్పటికే పూర్తి చేసిన టైసన్ నాయుడు, మేకింగ్ దశలో ఉన్న కిష్కింధపురి సైతం మంచి కథలతో తెరకెక్కాయని.. ఔట్ పుట్ బాగా వచ్చిందని.. ఇవి కూడా పెద్ద హిట్ అవుతాయని శ్రీనివాస్ తెలిపాడు. ‘భైరవం’తో పాటు తన చేతిలో ఉన్న ప్రతి సినిమాకూ బిజినెస్ బాగా జరుగుతోందని.. తనకున్న హిందీ ఫాలోయింగ్ వల్ల డబ్బింగ్ హక్కులకు మంచి రేటు వస్తోందని చెప్పాడు శ్రీనివాస్. ‘భైరవం’ తమిళ హిట్ ‘గరుడన్’కు రీమేక్ అయినప్పటికీ.. అది రీమేక్ లాగా అనిపించదని శ్రీనివాస్ చెప్పాడు. ఆ కథలోని సోల్ మాత్రమే తీసుకుని.. చాలా మార్పులు చేశామని అతనన్నాడు. ‘భైరవం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.