యమదొంగ లెక్క ఎందుకు తప్పింది

రీ రిలీజుల ట్రెండ్ ఎప్పటికప్పుడు అయిపోయింది అనుకున్నప్పుడంతా ఏదో ఒక సినిమా భారీ వసూళ్లు రాబట్టడం, మళ్ళీ ఇంకొన్ని క్యూ కట్టడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఈ ధోరణిని ఎలా అనాలసిస్ చేసుకోవాలో అర్థం కాక బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్నటి నుంచి థియేటర్లలో అడుగు పెట్టిన యమదొంగకు ఆశించిన స్థాయిలో భారీ స్పందన లేకపోవడం చూసి ఎగ్జిబిటర్లు ఆశ్చర్యపోతున్నారు. పలు చోట్ల హౌస్ ఫుల్స్ కనిపించినప్పటికీ అన్ని సెంటర్లలో ఒకే తరహా స్పందన లేదు. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాకుండా రెండు రోజుల ముందే విడుదల చేయడం కలిసి రాలేదు.

ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజమౌళి దర్శకుడు. దేవర లాంటి రికార్డులు బద్దలు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ చేసిన మూవీ, వీటికి తోడు కీరవాణి సూపర్ హిట్ పాటలు. ఇవి చాలు అభిమానులు సెలెబ్రేట్ చేసుకోవడానికి. కానీ యమదొంగకు రెస్పాన్స్ తగ్గిన విషయంలో పలు కారణాలు కనిపిస్తున్నాయి. జక్కన్న ఫిల్మోగ్రఫీలో యమదొంగ టాప్ 5 లో లేదు. బాహుబలి, మగధీర, విక్రమార్కుడు, ఛత్రపతి, సింహాద్రి తర్వాతే మూవీ లవర్స్ దీనికి చోటిస్తారు. పైగా శాటిలైట్ ఛానల్స్ లో చాలాసార్లు ప్రసారం కాగా యూట్యూబ్ లో 4k క్లారిటీతో ఉచితంగా అందుబాటులో ఉంది.

గమనించాల్సిన పాయింట్ మరొకటి ఉంది. ఇటీవలే జగదేకవీరుడు అతిలోకసుందరిని వింటేజ్ సినీ ప్రియులు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేశారు. దాని స్థాయికి తగ్గ కలెక్షన్లు వచ్చాయి. తక్కువ గ్యాప్ లో యమదొంగ రావడంతో మళ్ళీ బడ్జెట్ కేటాయించుకోవడానికి ప్రేక్షకుల పర్సులు సహకరించక పోయుండొచ్చు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం మే 30 ఖలేజాతో అసలైన రీ రిలీజ్ ట్రెండ్ అంటే ఏమిటో చూపిస్తామని సోషల్ మీడియాలో సవాల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా బద్రి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకున్న విశ్లేషణ ఎంత వరకు రైటో ఆ రెండూ వచ్చాక తేలుతుంది.