=

పెద్దాయన చేయనంటే సినిమా ఆపేయండి

బాలీవుడ్ కామెడీ బ్లాక్ బస్టర్స్ లో హేరాఫేరీది ప్రత్యేక స్థానం. 2000 సంవత్సరంలో వచ్చిన మొదటి భాగం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. మలయాళం సూపర్ హిట్ రాంజీరావ్ స్పీకింగ్ కు రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ కన్నా గొప్పగా ఆడిన ఈ క్లాసిక్ కి కొనసాగింపుగా హేరాఫేరీ 2 ఆరేళ్ళ తర్వాత 2006లో వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టరే. దర్శకుడు ప్రియదర్శన్ ఒక కొత్త ఒరవడికి దారి చూపారని పత్రికలు ప్రశంసలతో ముంచెత్తాయి. అయితే సుమారు రెండు దశబ్దాలు అవుతున్నా మూడో భాగం అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ గా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ప్రకటనకు రెడీ అయ్యారు.

మరికొద్ది రోజుల్లో స్టార్టవుతుందనంగా హేరాఫేరీ 3లో తాను నటించడం లేదంటూ పరేష్ రావల్ పేర్కొనడం మూవీ లవర్స్ గుండెల్లో బాంబు వేసినట్టయ్యింది. ఎందుకంటే సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకుని బాబురావు గణపత్ రావు ఆప్టేగా ఆయన పెర్ఫార్మన్స్ హేరాఫేరీ రెండు భాగాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇద్దరు హీరోలు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి ఉన్నప్పటికీ చాలా సీన్లలో తనదైన టైమింగ్ తో పరేష్ రావల్ డామినేట్ చేయడం రిపీట్ ఆడియన్స్ ని తీసుకొచ్చింది. హేరాఫేరీని తెలుగులో ధనలక్ష్మి ఐ లవ్ యుగా రీమేక్ చేస్తే అంత అనుభవమున్న సీనియర్ నరేష్ సైతం పరేష్ ని మ్యాచ్ చేయలేకపోయారు.

కారణాలు ఏమైనా పరేష్ రావల్ లేకపోతే హేరాఫేరీ 3 ఆపేయమంటున్నారు సినీ ప్రియులు. బాబురావు ఆప్టే లేకుండా ఈ సిరీస్ ని చూడలేమంటూ తేల్చి చెబుతున్నారు. నిజంగానే ఆయన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. క్రియేటివ్ డిఫెరెన్సులు ఏమి లేవని, ప్రియదర్శన్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని చెబుతున్న పరేష్ రావల్ అసలు కారణాలు మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే ఆయనకు సబ్సిట్యూట్ గా మరో ఆర్టిస్టు కనుచూపు మేరలో లేరు. పైగా బాబురావుగా ఎవరు నటించిన విమర్శలకు గురి కావడం ఖాయం. మరేం చేస్తారో వేచి చూడాలి.