జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీకి వచ్చినా బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లతో బాగానే దూసుకుపోతున్న హీరో నితిన్ నార్నె ఇటీవలే శ్రీవిష్ణు సింగిల్ లో చిన్న క్యామియో చేశాడు. అయితే ఇప్పటిదాకా నితిన్ నార్నె డెబ్యూ మూవీ రిలీజ్ కాలేదంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. శ్రీశ్రీశ్రీ రాజావారు పేరుతో రూపొందిన లవ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్ రెండో వారంలో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. దీని ట్రైలర్ చాలా కాలం క్రితమే వచ్చింది. కొంచెం అటుఇటుగా రెండేళ్ల ముందే షూటింగ్ అయిపోయింది. కానీ రకరకాల కారణాల వాయిదా పడుతూ చివరికి మోక్షం దక్కించుకోనుందట.
అలాని ఇదేదో అనుభవం లేని డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమా కాదు. శతమానం భవతి లాంటి నేషనల్ అవార్డు ఫ్యామిలీ మూవీ ఇచ్చిన సతీష్ వేగ్నేశ దర్శకుడు. ఇంత బ్రాండింగ్ ఉండి కూడా శ్రీశ్రీశ్రీ రాజావారు లేట్ కావడం ఆశ్చర్యమే. మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ మూడు విజయవంతమయ్యాక నితిన్ నార్నెకు బాగానే మార్కెట్ పెరిగింది. వాటి సక్సెస్ లో తనది సోలో క్రెడిట్ కాకపోయినా ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు. కాకపోతే డెబ్యూ మూవీ ఇంత ఆలస్యం రావడం బిజినెస్ పరంగా నిర్మాతకు ఉపయోగపడుతుందేమో కానీ హీరోగా నితిన్ నార్నెకు దక్కే అడ్వాంటేజ్ తక్కువేనని చెప్పాలి టాక్ ఎక్స్ ట్రాడినరిగా వస్తే తప్ప.
గతంలో విజయ్ దేవరకొండ, నిఖిల్ లాంటి యూత్ హీరోలు సైతం ఈ సమస్యను ఎదురుకున్నారు. ఒక బ్లాక్ బస్టర్ రాగానే ల్యాబ్ లో రిలీజ్ ఆగిపోయిన సినిమాలు తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరిగింది. అవి ఆడకపోవడం వేరే సంగతి. ఇప్పుడు నితిన్ నార్నెకి గుర్తింపు వచ్చింది కాబట్టి థియేటర్ బిజినెస్ జరగొచ్చు కానీ మారిన ఇమేజ్ దృష్ట్యా ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అసలే మాస్ టచ్ జోడించిన సినిమా. నార్నె చేసినవాటిలో ఇప్పటిదాకా అన్నీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లే. పైగా మూడు శ్రీలతో రాజావారు అని టైటిల్ పెట్టడం కూడా మాస్ ని టార్గెట్ చేసినట్టు ఉంది. చూడాలి ఏమవుతుందో.