ఇంకా విడుదల తేదీ అధికారికంగా ప్రకటించనప్పటికీ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ జూన్ 12 రావడం ఖాయమనే మాట డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఇవాళో రేపో రావొచ్చని ఇన్ సైడ్ టాక్. సోమవారం ప్రెస్ మీట్ ద్వారా పూర్తి వివరాలను వెల్లడి చేయబోతున్నారని సమాచారం. ట్రైలర్ కట్ రెడీ చేశారు. పవన్ కళ్యాణ్ వీలు చూసుకుని డబ్బింగ్ చెప్పేస్తే దానికీ ముహూర్తం కుదిరిపోతుంది. ఇప్పటిదాకా హైప్ పరంగా వెనుకబడిన ఈ హిస్టారికల్ డ్రామాకు సంబంధించి కొన్ని కీలకమైన విశేషాలు ఆసక్తి రేపేలా ఉన్నాయి. ముఖ్యంగా వార్డ్ రోబ్ సంగతులు చూస్తే షాకే అనిపిస్తుంది.
వీరమల్లు కాస్ట్యూమ్స్ కోసం 1000 టన్నులకు పైగా కాటన్ ఫ్యాబ్రిక్ వాడారు. ప్రత్యేకంగా పవన్ కోసమే 20 రకాల అవుట్ ఫిట్స్ తయారు చేయించారు. వాటిలో మనం రెగ్యులర్ గా చూసిన కుర్తా దోతీ కాంబినేషన్ కూడా ఉంది. దుస్తుల్లో సౌకర్యం, సంప్రదాయం రెండూ కలిసేలా తొంభై శాతం పత్తిని వాడటం విశేషం. పవన్ వాడిన, వేసుకున్న ఆభరణాలు వైపు చూస్తే అమ్మవారి రక్షతాడు, బ్రేస్ లెట్, నడుముకి ధరించిన వస్త్రం మీద ఈగ ముద్ర, ఎర్రటి కాశ్మీరీ పష్మిన షాల్ వగైరాలు ప్రత్యేకంగా డిజైన్ చేయించినవి. ఇరవై జతల స్వచ్ఛమైన లెదర్ తో తయారు చేసిన చెప్పులు, జోళ్ళను వీరమల్లులో వాడారు.
సినిమా మొత్తం వాడిన జ్యువెలరీ సుమారు 500 కిలోల పైమాటేనట. వీటికే మూడు కోట్లకు పైగా ఖర్చయ్యిందని సమాచారం. హీరో నుంచి జూనియర్ ఆరిస్టుల దాకా అందరూ వేసుకున్న నగలను లెక్కేస్తే ఇంకా ఎక్కువ మొత్తమే వస్తుందట. వజ్రాలు, రాళ్ళూ, రత్నాలు, జుంకాలు ఇలా బోలెడు సామాగ్రిని స్పెషల్ ఆర్డర్ ఇచ్చి చేయించారు. బంగారు, వెండి రెండూ ఇందులో భాగమయ్యాయి. నిధి అగర్వాల్, బాబీ డియోల్ కోసం నిజమైన బంగారు ఆభరణాలు వాడారట. పవన్ పాత్ర డిజైన్ దృష్ట్యా ఆయనకు అలంకరణ ఉండదు. చదివితేనే ఇంత ఘనంగా ఉన్న వీరమల్లు వార్డ్ రోబ్ ఇక తెరపై ఏ స్థాయిలో కనిపిస్తుందో చూడాలి.