=

శ్రీవిష్ణు చుట్టూ వద్దన్నా వివాదాలు

సరదాగా కనిపిస్తూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని శ్రీవిష్ణు చుట్టూ వద్దన్నా కాంట్రవర్సిలు వస్తున్నాయి. టీజర్ టైంలో శివయ్య డైలాగు మీద అభ్యంతరం ఏర్పడితే దానికి సారీ చెప్పేసి, ఆ మాటను తీయించి రచ్చ పెద్దది కాకుండా చూసుకోవడంతో ఇబ్బంది లేకుండా పోయింది. సింగిల్ హిట్టవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. కథ ఇక్కడితో అయిపోలేదు. తాజాగా తమ వర్గాన్ని కించపరిచేలా తన సినిమాల్లో సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు క్రిస్టియన్ ప్రతినిధులు ఆరోపించారు. ఇకపై తన చిత్రాలను బ్యాన్ చేస్తామని, ఇకపై తమ వర్గం వాళ్ళు చూడకుండా పిలుపు ఇస్తామని చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది.

వాళ్ళ మాటల ప్రకారం స్వాగ్ లోనూ అలాంటి సన్నివేశాలు ఉన్నాయట. లాజికల్ గా చూస్తే క్రిస్టియన్ అనే కాదు మత వేషాలతో క్యారెక్టర్ ఆర్టిస్టులతో కామెడీ చేయించడం కొత్తేమి కాదు. ఇదే వెన్నెల కిషోర్ లక్ష్మి రావే మా ఇంటికిలో మటన్ కొట్టు మస్తాన్ గా మంచి హాస్యం పండించాడు. దేనికైనా రెడీలో బ్రాహ్మణుల మీద జోకులు వేసినప్పుడు చిన్నపాటి గొడవ జరిగింది. సీమ శాస్త్రి కూడా ఇదే క్యాటగిరీనే. ఇలా బోలెడున్నాయి. ఇప్పుడు శ్రీవిష్ణు ఎలా స్పందిస్తాడనే దానికన్నా అసలివి ఎందుకు వస్తున్నాయనేది చూడాల్సిన అవసరముంది. సెన్సార్ తెచ్చుకున్న సినిమాలకే ఇబ్బంది వస్తే ఎలా అనేదే ప్రశ్న.

ఇదంతా పక్కన పెడితే సింగిల్ సూపర్ హిట్టయ్యాక కూడా శ్రీవిష్ణుకి ఇలాంటి చిక్కులు రావడం విచిత్రమే. మరో క్షమాపణ చెప్పొచ్చు కానీ ప్రతిసారి ఇవి రిపీట్ కావడం సరికాదు. అయినా సెన్సార్ బోర్డు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పనప్పుడు భూతద్దంలో వెతికి మరీ డిమాండ్లు పెట్టడం ఏంటని అభిమానుల కామెంట్. చూస్తుంటే రాబోయే రోజుల్లో స్క్రిప్ట్ స్టేజిలో ఏదైనా డౌట్ వస్తే మనోభావాలు దెబ్బ తింటాయో లేదో చెక్ చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. దీని సంగతలా ఉంచితే పాతిక కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న సింగిల్ కు ఇంకో మంచి వీకెండ్ దొరికేలా ఉంది. కొత్త రిలీజులకు ఆశించిన టాక్ లేకపోవడమే కారణం.