ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇది నెలల క్రితమే లీకైనప్పటికీ దాని గురించి మౌనం పాటిస్తూ వచ్చిన టీమ్ ఎట్టకేలకు దాన్నే లాక్ చేసుకోవడం విశేషం. గత కొంత కాలంగా మితిమీరిన మాస్ ప్రయోగాలతో వరసగా ఫెయిల్యూర్స్ చవి చూసిన రామ్ ఫైనల్ గా తనదైన ఎంటర్ టైన్మెంట్ స్కూల్ కు వచ్చేశాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు మహేష్ బాబు ఈసారి విభిన్నమైన కథను ఎంచుకున్నాడు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రెండు నిమిషాల కాన్సెప్ట్ టీజర్ ని ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు.
కథను రివీల్ చేయలేదు కానీ టైటిల్, వీడియో, ట్యాగ్ చూస్తే ఇదో సినీ హీరో అభిమాని కథనే క్లారిటీ అయితే వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర). అతనంటే పడిచచ్చే ఫ్యాన్ (రామ్) కు మొదటి రోజు బెనిఫిట్ షోకు కనీసం యాభై టికెట్లు తెంపనిదే నిద్ర రాదు. అలాంటి వీరాభిమాని జీవితంలో ఏం జరిగిందనే పాయింట్ మీద ఆంధ్ర కింగ్ తాలూకా రూపొందింది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తెలుగులో అరుదు. హిందీలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో ఫ్యాన్ చేశాడు కానీ అందులో ఒక పాత్ర ఓవర్ నెగటివ్ కావడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే రామ్ మూవీలో ఆ సమస్య ఉండదు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఆంధ్ర కింగ్ అని అంత పెద్ద టైటిల్ పెట్టి కన్నడ ఉపేంద్రని తీసుకురావడం విచిత్రం. అయితే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలను సంప్రదించి ఒప్పించేందుకు విశ్వప్రయత్నం చేశారని, కానీ కుదరలేదని ఇన్ సైడ్ టాక్. ఉపేంద్ర శాండల్ వుడ్ నుంచే వచ్చినా తెలుగులో రా, ఒకే మాట, సన్నాఫ్ సత్యమూర్తి, గని లాంటి స్ట్రెయిట్ సినిమాలు చేశాడు. సో కనెక్ట్ అవ్వకపోవడమనే సమస్య ఉండదు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకాకు వివేక్ మెర్విన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విడుదల తేదీ ప్రకటించలేదు కానీ దసరా లేదా దీపావళి ఉండొచ్చు.