‘ఆయ్’ దర్శకుడి నెక్స్ట్ ఫిక్స్

గత ఏడాది చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన వాటిలో ‘ఆయ్’ ఒకటి. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్‌ను హీరోగా పెట్టి అంజి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. గీతా ఆర్ట్స్ సంస్థ ఆగస్టు 15 వీకెండ్లో గట్టి పోటీ మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేసి మంచి ఫలితం రాబట్టింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి ఈ చిత్రం బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది. దర్శకుడు అంజికి ఇది తొలి చిత్రమైనా.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకులను అలరించి ఘనవిజయాన్నందుకున్నాడు. ఇప్పుడీ దర్శకుడు రెండో సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

తొలి సినిమా చేసిన గీతా ఆర్ట్స్‌లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న శ్రీ విష్ణు ఖరారయ్యాడట. ఈ క్రేజీ కాంబోలో సినిమా త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. శ్రీ విష్ణు ఇటీవలే ‘సింగిల్’తో మంచి హిట్టు కొట్టాడు. కెరీర్ ఆరంభంలో సీరియస్ సినిమాలే చేసిన అతను.. ప్రస్తుతం ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు.

‘సామజవరగమన’, ‘స్వాగ్’, ‘సింగిల్’ చిత్రాలతో తన ఫాలోయింగ్ బాగా పెరిగింది. తన శైలికి.. అంజి స్లైల్‌కు బాగానే మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు. శ్రీ విష్ణుతో కూడా అంజి ‘ఆయ్’ తరహా ఎంటర్టైనర్‌ తీస్తే పెద్ద హిట్ అందుకోవడం ఖాయం. గోదావరి నేపథ్యంలో అక్కడి యాసతో సినిమా తీస్తే ఇద్దరికీ బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ‘సింగిల్’ మూవీతో విష్ణుకు, గీతా ఆర్ట్స్ సంస్థకు మంచి అనుబంధం ఏర్పడింది. గీతా సంస్థకు ఈ సినిమా మంచి లాభాలందించింది. ఈ సినిమాను వాళ్లు బాగా ప్రమోట్ చేసి, పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడంతో విష్ణు రేంజ్ కూడా పెరిగింది. దీంతో మళ్లీ అతను హీరోగా సినిమా చేయడానికి ఒప్పందం కుదిరింది.