రెండు వారాల ఉత్సాహం.. మళ్లీ నీరసం

టాలీవుడ్ అనే కాక ఇండియన్ బాక్సాఫీస్‌లో ఈ వేసవి పెద్దగా ఉత్సాహం నింపలేకపోయింది. మామూలుగా సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజై థియేటర్లు కళకళలాడుతుంటాయి కానీ.. గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. మిడ్ రేంజ్, చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వాటిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు తక్కువగానే ఉంటున్నాయి. ఈ ఏడాది వేసవి సీజన్ పేలవంగా ఆరంభమైంది. సరైన సినిమాలు పడక ఏప్రిల్ నెల బాక్సాఫీస్ డల్లుగా తయారైంది. అలాంటి టైంలో మే 1న నాని సినిమా ‘హిట్-3’ వచ్చి థియేటర్లను కళకళలాడించింది. చాన్నాళ్ల తర్వాత వెండి తెరలు వెలిగిపోయాయి ఈ చిత్రంతో. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లలో సందడి కనిపించింది.

ఈ ఊపును కొనసాగిస్తూ గత వారం ‘సింగిల్’ సినిమా కూడా మంచి స్పందనే తెచ్చుకుంది. వీకెండ్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. వీక్ డేస్‌లో పర్వాలేదనిపిస్తోంది. కానీ రెండు వారాలు సందడిగా సాగిన బాక్సాఫీస్.. మళ్లీ కళ తప్పే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వారం, తర్వాతి వారం చెప్పుకోదగ్గ సినిమాలే లేవు. ఈ వీకెండ్లో ఎలెవన్, 23 లాంటి సినిమాలు వస్తున్నాయి కానీ.. వాటికి బజ్ లేదు.

ఈ సినిమాలు రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి. కంటెంట్ బాగుండి, ఫుల్ పాజిటివ్ రివ్యూలు వస్తే తప్ప వీటి వైపు ప్రేక్షకులు చూడడం కష్టమే. తర్వాతి వారంలో అయితే ఈ మాత్రం సినిమాలు కూడా లేవు. ప్రస్తుతానికి ఆ వీకెండ్ ఖాళీగానే కనిపిస్తోంది. చివరి వారంలో రావాల్సిన ‘కింగ్‌డమ్’ వాయిదా పడిపోయింది. ఆ స్థానంలో రాబోతున్న ‘భైరవం’ ఏమేర బజ్ తెచ్చుకుంటుందో చూడాలి. జూన్ 5న థగ్ లైఫ్ రావాల్సి ఉంది. 13న ‘హరిహర వీరమల్లు’ వస్తుందంటున్నారు. అప్పటికి కానీ మళ్లీ థియేటర్లలో అనుకున్నంత సందడి కనిపించదేమో.