గోవిందుడి పాట వివాదంతో ఉచిత పబ్లిసిటీ

ఒక్కోసారి వివాదాలే సినిమాలకు పబ్లిసిటీ తెచ్చి పెడతాయి. తమిళ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ ఎల్లుండి విడుదల కాబోతోంది. ఇటీవలే విడుదల చేసిన కిస్సాక్ 47 లిరికల్ సాంగ్ లో గోవిందా నామాలను రీమిక్స్ చేయడం తీవ్ర కాంట్రావర్సికి దారి తీస్తోంది. పవిత్రమైన ఏడుకొండలవాడి స్తోత్రాన్ని అపవిత్రం చేశారంటూ బిజెపితో పాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి సంతానం స్పందిస్తూ తాము దేవుడిని అవమానించలేదని, సెన్సార్ ఓకే చెప్పిందని, దారిన పోయేవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు.

దీంతో ఇష్యూ ఇంకాస్త ముదిరిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం మొదలైన డిల్లకు దుడ్డు సిరీస్ లో ఇది నాలుగో సినిమా. సంతానంని స్టార్ గా మార్చింది కూడా ఈ చిత్రమే. హారర్ జానర్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది. వాస్తవానికి పాట వింటే అభ్యంతరం వ్యక్తం చేసేలానే ఉంది. గోవిందా నామాన్ని రీమిక్స్ చేయడం ఏ కోణంలో చూసినా తప్పే. క్రియేటివిటీ పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బ తీయడం కరెక్ట్ కాదు. గతంలో ఖడ్గంలోనూ ఇలాంటి ప్రయోగం చేశారు కానీ ఆ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆ సాహిత్యంలో తప్పుడు అర్థాలు లేకపోవడం వల్ల పెద్దగా హైలైట్ కాలేదు. సాంగ్ హిట్టయ్యింది కానీ ఎవరూ వేలెత్తి చూపలేదు.

ఇప్పుడీ వ్యవహారం డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ కు ఫ్రీ పబ్లిసిటీ అవుతోంది. తెలుగు డబ్బింగ్ చేస్తున్నారు కానీ మే 16 వచ్చే సూచనలు తక్కువగా ఉన్నాయి. జనసేన పార్టీ తరఫున కొందరు తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి వినతి పత్రం అందించారు. పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. దీన్ని బ్యాన్ చేయాలనే నినాదాలు ఊపందుకున్నాయి. అయితే రెండు రోజుల్లో విడుదల ఉంది కనక టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పాట తీసేస్తారో లేక మొండిపట్టుతో అలాగే ముందుకెళ్తారో చూడాలి. అన్నట్టు ఇందులో నటుడు గౌతమ్ మీనన్ ఘర్షణలో చెలియా చెలియా పాట రీ క్రియేషన్ లో డాన్స్ చేయడం విశేషం.