మొన్నటి ఏడాది నాని హాయ్ నాన్నతో ఎమోషనల్ హిట్టు కొట్టిన దర్శకుడు శౌర్యువ్ కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. సంవత్సరం దాటిపోయినా ఎలాంటి అప్డేట్ లేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు సిద్ధం చేసుకున్న శౌర్యువ్ దాని కోసం శతవిధాలా ప్రయత్నించాడు కానీ తారక్ డేట్స్ ఇప్పట్లో దొరికేలా లేకపోవడంతో ఇప్పుడు రూటు మార్చుకుని అదే కథని విజయ్ దేవరకొండతో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం. రౌడీ జనార్ధనా, మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ తర్వాత ఇదే ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్.
ఇప్పటికైతే అధికారిక సమాచారం లేదు కానీ చర్చలు దాదాపుగా కొలిక్కి వచ్చాయట. గతంలో గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అనౌన్స్ మెంట్ స్టేజి లో రామ్ చరణ్ డ్రాపైన సంగతి తెలిసిందే. దాంతో అతను విజయ్ దేవరకొండతో చేతులు కలిపాడు. అదే కింగ్ డమ్. రెండూ ఒకే కథేనని సన్నిహిత వర్గాల మాట. ఇప్పుడు తారక్ నో అనుకున్న ప్రాజెక్టుని సైతం రౌడీ హీరో టేకప్ చేయడం ఆసక్తి రేపుతోంది. బ్యానర్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కానీ బుచ్చిబాబు ఇప్పుడు తీస్తున్న పెద్ది కూడా ఒకప్పుడు జూనియర్ కు చెప్పిందేననే ప్రచారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
సరే ఎవరికి రాసిపెట్టింది వాళ్లకు చెందుతుందనే తరహాలో ఇంతకు ముందు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఒక హీరో నుంచి ఇంకో హీరోకు మారిపోవడం చూస్తూనే ఉన్నాం. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో శౌర్యువ్ రాసుకున్న స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. హాయ్ నాన్నలో కేవలం భావోద్వేగాలకు చోటిచ్చిన ఈ సెన్సిబుల్ దర్శకుడు ఈసారి రూటు మారుస్తున్నాడట. కింగ్ డమ్ విడుదల కాగానే దర్శకులు రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యాన్ లతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ నిజంగానే శౌర్యువ్ కు ఓకే చెప్పాడా లేడానేది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది. ఈ మధ్య కాంబోలు అటుఇటు కావడం కామనైపోయింది.