హరిహర వీరమల్లు పూర్తయిన ఆనందాన్ని అభిమానులు ఆస్వాదిస్తుండగానే నిన్న ఓజి షూటింగ్ పునఃప్రారంభం కావడం వాళ్లలో కొత్త జోష్ తీసుకొస్తోంది. తాజా షెడ్యూల్ లో కొందరు ఫారిన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని సమాచారం. ఈ వారంలోనే పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు. తొలుత మంగళగిరిలో – తాడేపల్లి సమీపంలో సెట్స్ వేసి ఫినిష్ చేస్తారనే టాక్ ఉన్నప్పటికీ కీలకమైన ఎపిసోడ్స్ కోసం ముంబై వెళ్లేందుకు పవన్ అంగీకారం తెలుపడంతో దర్శకుడు సుజిత్ ఆ మేరకు ఏర్పాట్లలో ఉన్నాడట. మెయిన్ విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇదే షెడ్యూల్ లో పవన్ తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నాడు.
ప్రస్తుతానికి ఓజి పెట్టుకున్న రిలీజ్ టార్గెట్ సెప్టెంబర్ మొదటి వారం. ఇది అంత సులభం కాదు కానీ అలాని అసాధ్యమూ కాదు. పక్కా ప్రణాళికతో చేసుకుంటే రీచ్ అవ్వొచ్చు. పవన్ తాలూకు బ్యాలన్స్ జూన్ లోనే అయిపోతుందట. ఒకవేళ నిజమైతే పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ తదితర కార్యక్రమాలకు తగినంత సమయం దొరుకుతుంది. సుజిత్ కష్టపడుతోంది దాని కోసమే. వీరమల్లు, ఓజిల మధ్య కేవలం మూడు నెలల గ్యాపే రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తి రెట్టింపవుతోంది. ఆగస్ట్ లో మిరాయ్, వార్ 2, కూలి లాంటి సినిమాలుండటంతో సెప్టెంబర్ మంచి ఆప్షన్ అవుతుంది. దసరా డేట్ పరిశీలనలో ఉంది.
ప్రస్తుతానికి నిర్మాణ సంస్థ షూటింగ్ అప్డేట్ తప్ప ఇంకే వివరాలు ప్రకటించలేదు. ఇప్పటిదాకా కెమెరామెన్ గా వ్యవహరించిన రవి కె చంద్రన్ స్థానంలో మనోజ్ పరమహంస వచ్చారని లేటెస్ట్ న్యూస్. తమిళంలో రవి కె చంద్రన్ పని చేస్తున్న శివ కార్తికేయన్ పరాశక్తి డేట్లతో క్లాష్ రావడం వల్లే ఈ మార్పు అనివార్యమయ్యిందని అంటున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో సలార్ ఫేమ్ శ్రియ రెడ్డి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. పవన్ డేట్లు ఇచ్చేశారు కాబట్టి ఇకపై ఎలాంటి డౌట్లు అక్కర్లేదు కానీ ముందు రిలీజ్ గురించి ఒక సాలిడ్ క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్.
Gulte Telugu Telugu Political and Movie News Updates