ఒకప్పుడు సౌత్ ఇండియాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలు పెద్దగా తెరకెక్కేవే కావు. బాలీవుడ్ ఎప్పట్నుంచో వీటిలో ముందున్నప్పటికీ.. సౌత్ చిత్రాలకు మాత్రం అవి కలిసి రాకపోవడం వల్ల వాటి మీద దృష్టిపెట్టేవారు కాదు. కానీ రాజమౌళి ‘బాహుబలి’ని రెండు భాగాలుగా తీసి గొప్ప ఫలితం రాబట్టడంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఒకే కథను రెండు భాగాలుగా తీయడం.. ఒక కథకు మళ్లీ సీక్వెల్ తీయడం.. ఒక క్యారెక్టర్ లేదా కాన్సెప్ట్‌ను ఫ్రాంఛైజీగా మార్చడం ట్రెండుగా మారింది. ఈ ట్రెండును అందిపుచ్చుకుని తమిళ కథానాయకుడు కార్తి దూసుకెళ్లిపోతున్నాడు.
ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధికంగా సీక్వెల్స్/ఫ్రాంఛైజీ సినిమాలు చేస్తున్న హీరో అతనే అని చెప్పాలి. కార్తి ఆల్రెడీ తన సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’కు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా తెలుగు చిత్రం ‘హిట్-3’ క్లైమాక్స్‌లో మెరిశాడు కార్తి. ‘హిట్-4’లో అతనే హీరో అనే విషయం ఖరారైంది. అందులో అతను వీరప్పన్ అనే పాత్రలో కనిపించనున్నాడు.
కార్తి నటించబోయే మరో సీక్వెల్ ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. అదే.. ఖైదీ-2. ‘ఖైదీ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్.. ఎప్పట్నుంచో దీని సీక్వెల్ గురించి చెబుతున్నాడు. ఇప్పుడు ‘కూలీ’ తర్వాత తన ఇమ్మీడియట్ మూవీ అదే అని మరో కన్ఫమ్ చేశాడు. మరోవైపు కార్తి కెరీర్లో చాలా స్పెషల్ ఫిలిం అనదగ్గ ‘ఖాకీ’కి కూడా సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్‌తో ‘జననాయగన్’ తీస్తున్న హెచ్.వినోద్.. తర్వాత ‘ఖాకీ-2’ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. మరోవైపు ‘కంగువ’ క్లైమాక్స్‌లో కార్తి పాత్రను ప్రవేశపెట్టి దాని సీక్వెల్ గురించి కూడా అనౌన్స్ చేశారు కానీ.. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో దానికి బ్రేక్ పడినట్లే. కంగువ బాగా ఆడి ఉంటే కార్తి సీక్వెల్స్ లిస్టులో కంగువ-2 కూడా ఉండేది.