‘‘లేస్తాం.. తింటాం.. తాగుతాం.. పని చేసుకుంటాం.. సలార్ చూసి పడుకుంటాం’’ సోషల్ మీడియా జనాలను డైలీ రొటీన్ ఏంటి అని అడిగితే.. సరదాగా చెప్పే సమాధానం ఇది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేదు.. ఏడాది కిందట్నుంచి అన్ని ప్రధాన భాషల్లోనూ ‘సలార్’ సినిమాను విపరీతంగా చూస్తున్నారు జనాలు. 2023 డిసెంబర్లో థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘సలార్’ సినిమా.. రెండు నెలల తర్వాత నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజ్ అయింది. థియేటర్లను మించి ఇక్కడ ఆ చిత్రానికి స్పందన వచ్చింది. ఇందులో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఓటీటీల్లో బోలెడంత కంటెంట్ ఉన్నా మళ్లీ మళ్లీ ‘సలార్’ చూడడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. అమ్మాయిలు సైతం ఈ సినిమాను రిపీట్స్‌లో చూస్తామని సోషల్ మీడియాలో చాలా ఎగ్జైట్మెంట్‌తో చెబుతుంటారు. ‘సలార్’ సినిమా డిజిటల్‌గా రిలీజై 450 రోజులు దాటింది. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా టాప్-10లో ట్రెండ్ అవుతోందంటే దాని ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పెద్ద హీరోలు నటించిన సినిమాలు.. డిజిటల్‌గా రిలీజయ్యాక కొన్ని వారాల పాటు ట్రెండింగ్‌లో ఉంటాయి. తర్వాత కొత్త సినిమాలు రాగానే వెనక్కి వెళ్లిపోతుంటాయి. కానీ రిలీజై 15 నెలలు దాటినా.. మధ్యలో ఎన్నో భారీ చిత్రాల నుంచి పోటీ ఎదురైనా ‘సలార్’ ఇంకా ట్రెండ్ అవుతోందంటే దీనికి డిజిటల్‌గా ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘సలార్’ను ఇలా సెలబ్రేట్ చేస్తున్న వారిలో కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే వేరు. వేరే హీరోల ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను ఆదరిస్తుండడం వల్లే ఇంకా ట్రెండింగ్‌లో ఉంది.