శ్రీ విష్ణు.. స్టామినా చూపిస్తున్నాడు

కొన్నేళ్ల ముందు వరకు టాలీవుడ్లో చిన్న స్థాయి కథానాయకుల్లో ఒకడిగా ఉండేవాడు శ్రీ విష్ణు. అప్పుడప్పుడూ ఓ హిట్టు కొట్టేవాడు కానీ.. పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడే తన చిత్రాలు ఆడేవి. శ్రీ విష్ణుకంటూ స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ లేకపోవడంతో తన సినిమాలకు మంచి టాక్ వస్తే నెమ్మదిగా వసూళ్లు పుంజుకునేవి. లేదంటే ఓపెనింగ్స్ కూడా లేక ఇబ్బంది పడేవాడు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు ఇమేజ్ మారిపోయింది. అతను స్టార్ అనిపించుకోగల స్థాయిని అందుకున్నాడు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూత్ తన సినిమాలను బాగా ఇష్టపడుతున్నారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘స్వాగ్’ సినిమాకు కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.

ఇక శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ తన అసలైన బాక్సాఫీస్ స్టామినాను చూపిస్తోంది. ‘సింగిల్’ బలమైన కథ ఉన్న సినిమా కాదు. కేవలం కామెడీ మీద నడిచిన సినిమా. సినిమాలో లోపాలున్నా సరే.. చూసిన వాళ్లలో చాలామంది పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. శ్రీ విష్ణు పెర్ఫామెన్స్.. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీని కొనియాడుతున్నారు. వెన్నెల కిషోర్ రూపంలో విష్ణుకు సరైన కామెడీ పార్ట్‌నర్ దొరకడంతో ‘సింగిల్’ బాక్సాఫీస్ టెస్టును ఈజీగానే పాసైపోయింది.

శనివారం ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు వచ్చాయి. తొలి రోజును మించి థియేటర్లు కళకళలాడాయి. ఇక ఆదివారం రెస్పాన్స్ ఇంకా బాగుంది. ఈవెనింగ్, నైట్ షోలకు సిటీల్లోని మల్టీప్లెక్సులన్నీ ఫుల్ ఆక్యుపెన్సీలతో నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. సింగిల్ స్క్రీన్లు కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. మొత్తానికి ‘సింగిల్’ తొలి వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది. గత వారం ‘హిట్-3’ బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి రాగా.. ఈ వారం ‘సింగిల్’ కూడా మంచి ఊపునిస్తుండడం గొప్ప ఊరటే.