ఆ దర్శకుడు.. ఎనిమిదేళ్లకు మళ్లీ

తొలి సినిమాతో ప్రతిభ చాటిన దర్శకుడికి అవకాశాలకు లోటు ఉండదు. సినిమా ఓ మోస్తరుగా ఆడితే చాలు.. నిర్మాతలు క్యూ కట్టేస్తుంటారు. ఫస్ట్ ఛాన్స్ అందుకోవడమే కష్టం కానీ.. రెండో సినిమా కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక యువ దర్శకుడు మాత్రం తొలి సినిమాతో మెప్పించి కూడా రెండో అవకాశం కోసం ఎన్నో ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఏకంగా ఎనిమిదేళ్లకు కానీ అతను సెకండ్ ఛాన్స్ అందుకోలేకపోయాడు. ఆ యువ దర్శకుడే ఆర్ఎస్ నాయుడు. ఇతను సుధీర్ బాబు చిత్రం ‘నన్ను దోచుకుందువటే’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్నందుకుంది.

సుధీర్ బాబును చాలా బాగా ప్రెజెంట్ చేశాడని.. రొమాన్స్, కామెడీ, ఎమోషన్లను బాగా పండించాడని నాయుడు పేరు తెచ్చుకున్నాడు. తన రెండో చిత్రం ఒక స్టార్‌తో ఉంటుందని, పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతోందని వార్తలు కూడా వచ్చాయి. ఇండస్ట్రీలో తనకు మంచి డిమాండ్ ఏర్పడిందని కూడా చెప్పుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. నాయుడు తర్వాత కనిపించకుండా పోయాడు.

తన రెండో సినిమా గురించి ఊసే లేకపోయింది. అందరూ తనను మరిచిపోయిన సమయంలో మళ్లీ తన తొలి చిత్ర కథానాయకుడు సుధీర్ బాబుతోనే కొత్త సినిమాను అనౌన్స్ చేశాడిప్పుడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్స్‌లో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. డెబ్యూలో మాదిరి ఈసారి సాఫ్ట్ సినిమా తీయట్లేదు నాయుడు. ప్రస్తుత ట్రెండుకు తగ్గ భారీ యాక్షన్, ఈవెంట్ ఫిలిం ట్రై చేస్తున్నట్లున్నాడు. మరి ఈ జానర్లో నాయుడు ఎలా ప్రతిభను చాటుతాడో.. ఈసారైనా తన కెరీర్ వేగం పుంజుకుని వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.