చైతూకు విడాకులివ్వమని సమంతను అడిగితే..

టాలీవుడ్లో సెలబ్రేటెడ్ సెలబ్రెటీ కపుల్ అంటే చాలామంది నాగచైతన్య, సమంతలనే చూపిస్తారు. వాళ్ల కెమిస్ట్రీనే వేరని ఆ ఇద్దరినీ ఎప్పుడూ చూసినా అర్థమవుతూనే ఉంటుంది. తెరమీదే కాదు.. బయట కూడా వాళ్లిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి జంట విడిపోవాలని కోరుకున్నాడు ఒక నెటిజన్. సమంత అభిమాని అయిన ఆ వ్యక్తి.. చైతూను వదిలేసి తనకోసం వచ్చేయమని ఆమెను కోరాడు. దీనికి సామ్ తనదైన శైలిలో సరదాగానే బదులిచ్చింది.

తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టి ‘ఫీలింగ్ గుడ్’ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన ఒక నెటిజన్.. ‘‘చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం’’ అని కామెంట్ చేసి, సమంతను ట్యాగ్ చేశాడు. ఎవరో అనామకుడు కామెంట్ చేశాడులే అని లైట్ తీసుకోకుండా సమంత దానికి బదులిచ్చింది. ‘‘కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు’’ అని రిప్లై ఇచ్చింది. ఈ కాన్వర్జేషన్ నెటిజన్లను ఆకట్టుకుంది.

‘ఏమాయ చేసావె’తో మొదలైన చైతూ, సమంతల పరిచయం.. కొన్నేళ్లకు ప్రేమగా మారి.. మూడేళ్ల కిందట ఇద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చైతూ ఎప్పుడూ రిజర్వ్డ్‌గా కనిపిస్తే, సమంత అల్లరి పిల్లగా దర్శనమిస్తుంది. భిన్న ధ్రువాల్లా కనిపించినప్పటికీ వారి మధ్య అండర్‌స్టాండింగ్ తక్కువేమీ కాదు. కెమిస్ట్రీకి ఢోకా ఉండదు. కెరీర్ విషయానికి వస్తే చైతూ ప్రస్తుతం ‘లవ్ స్టోరి’తో పాటు ‘థ్యాంక్యూ’ సినిమాలో నటిస్తుండగా.. సమంత కొత్తగా ఏ సినిమా అంగీకరించలేదు.