ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు వారాల నుంచి రెండు నెలల మధ్యలోనే కొత్త సినిమాలు డిజిటల్ లో వస్తుంటే ప్రేక్షకులు టికెట్లు ఎందుకు కొంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇండియాలో స్క్రీన్లు చాలట్లేదు, జపాన్ చైనా తరహాలో వేలాదిగా కొత్తవి అందుబాటులోకి రావాలని అన్నాడు. వినడానికి ఇదంతా బాగానే ఉంది కదా, అమీర్ కున్న దూరాలోచనకు అందరూ సూపర్ అనుకున్నారు. తీరా చూస్తే కబుర్లు చెప్పేందుకు తప్ప పాటించడానికి కాదనేలా ఉంది అమీర్ ఖాన్ వ్యవహారం. బాలీవుడ్ మీడియా అదే చెబుతోంది.
జూన్ 20 విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ ఎనిమిది వారాల థియేటర్ రన్ తర్వాత యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేసే ఆలోచన సీరియస్ గా చేస్తున్నారట. అంటే ఓటిటిలకు అమ్మకుండా తనకే ప్రతి రూపాయి వచ్చే ప్లాన్ అన్నమాట. ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే కట్టుదిట్టమైన ఫైర్ వాల్స్ ఉండే అంతర్జాతీయ ఓటిటిలనే వదలకుండా పైరసీ చేస్తున్నారు చోరులు. అలాంటిది యూట్యూబ్ లో పెడితే ఊరుకుంటారా. అసలే ఇది హెచ్డి పైరసీ ట్రెండ్. రిలీజైన రోజు సాయంత్రానికే అదిరిపోయే ప్రింట్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాంటప్పుడు అమీర్ ది తెలివైన ఆలోచన కాదు.
సరే ఆయన సినిమా ఆయన ఇష్టం అనుకున్నా మరి వేవ్స్ 2025లో అన్నేసి నీతిబోధలు చేయడం ఎందుకనేదే అసలు ప్రశ్న. లాల్ సింగ్ చద్దాతో బాగా డిస్ట్రబ్ అయిన అమీర్ ఖాన్ ఆశలన్నీ సితారే జమీన్ పర్ మీదే ఉన్నాయి. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ యూత్ డ్రామా తనకు పూర్వ వైభవం తెస్తుందని నమ్ముతున్నాడు. నాగార్జున, ధనుష్ కుబేరతో పోటీ పడుతున్న సితారే జమీన్ పర్ డిజిటల్ డీల్ కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ అమీర్ చేసేది మాత్రం రిస్కే. మరి పరిణామాలు ముందే అలోచించి డెసిషన్ మార్చుకుంటాడో లేదో చూడాలి.