ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయాయి. దేశమంతా పడుకున్న సమయంలో శత్రుదేశం పాకిస్థాన్ గుడారాల మీద ఆర్మీ, వాయుసేనలు విరుచుకుపడి టెర్రరిస్టు స్థావరాలను మట్టుబెట్టిన తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యింది. పదుల సంఖ్యలో తీవ్రవాదులు అంతమయ్యారని తెలుసుకున్న పెహల్గామ్ బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఆపరేషన్ కొనసాగుతూ ఉండటంతో ఇంకెన్ని శుభవార్తలు వినాలో అని కోట్లాది ఇండియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ కూడా స్పందిస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా ట్వీట్లు, పోస్టులు పెడుతోంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రితేష్ దేశముఖ్, ఖుష్బూ ఇలా ఒక్కొక్కరుగా తమ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు. ఈ లిస్టు క్షణక్షణానికి పెరుగుతూ పోతోంది. గత నెల జరిగిన పెహల్గామ్ ట్రాజెడీతో నటీనటులు తల్లడిల్లిపోయారు. ఎందుకంటే ఎన్నో షూటింగులు అక్కడ జరిగాయి. నాని హిట్ 3, విజయ్ దేవకొండ ఖుషి, రవితేజ మిస్టర్ బచ్చన్ లాంటివి అక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రీకరణ జరుపుకున్నాయి.
సరిగ్గా అక్కడే తీవ్రవాదుల కాల్పులకు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ ఎప్పుడు ఇలాంటి ఆపరేషన్లు చేపట్టినా అలాంటి నేపధ్యాలతో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. బోర్డర్, యుఆర్ఐ నుంచి మొన్నటి గ్రౌండ్ జీరో దాకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడీ సిందూర్ మిషన్ పూర్తయ్యాక ఎవరో ఒకరు ఈ బ్యాక్ డ్రాప్ లోనూ సినిమా తీయకుండా పోరు. మాములుగా తెరమీద ఇలాంటి ఎన్నో విన్యాసాలు, ఎలివేషన్లు చూసిన జనాలకు అవి నిజ జీవితంలో కనిపించడం అరుదు. పాకిస్థాన్ టెర్రరిస్టు మూకల మీద ఆర్మీ దాడులు బిగ్ స్క్రీన్ కన్నా పెద్ద కిక్కు ఇస్తున్నాయన్నది వాస్తవం.