తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టింది కూడా ఈ నెలలోనే. తారక్ ప్రతి పుట్టిన రోజుకూ అభిమానుల కోసం ఏదో ఒక కానుక ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలు బయటికి వస్తుంటాయి ఆ రోజే. ఈసారి తారక్ తన ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రీట్ ఇవ్వబోతుండడం విశేషం.

ప్రస్తుతం తారక్ రెండు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘వార్-2’ చిత్రీకరణ దాదాపుగా పూర్తి కాగా.. ప్రశాంత్ నీల్ మూవీ ఇటీవలే మొదలైంది. ఈ రెండు చిత్రాలూ మే 20న తారక్ పుట్టిన రోజుకు ట్రీట్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా గ్లింప్స్ రాబోతున్నట్లు ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. టైటిల్‌తో ఒక పోస్టర్‌ రిలీజ్ చేయడంతో పాటు చిన్న వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారట.

బాలీవుడ్లో ఇలా హీరోల పుట్టిన రోజుకు గ్లింప్స్ రిలీజ్ చేయడం తక్కువే కానీ.. తారక్ కోసం ‘వార్-2’ టీం ఆ పని చేయబోతోంది. మరి తారక్ ఫ్యాన్స్‌కు నచ్చేలా ఎలాంటి గ్లింప్స్ వదులుతారో చూడాలి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే రెండు ప్రెస్టీజియస్ మూవీస్‌కు సంబంధించి గ్లింప్స్ రాబోతుండడంతో మే 20న సోషల్ మీడియాలో తారక్ పేరు మార్మోగిపోవడం ఖాయం. హృతిక్ రోషన్ మరో హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న‘వార్-2’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న విడుదలవుతుందని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.