కల్ట్ దర్శకుడి బృందం… సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ

తెలుగులో కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో అభిరుచి కలిగిన హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్ కు ఈ మధ్య రెండు మూడు ఫ్లాపులు తగిలి కొంచెం స్లో అయ్యాడు కానీ స్పీడ్ పూర్తిగా తగ్గించలేదు. త్వరలో ఓ భామ అయ్యో రామాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సుహాస్ త్వరలోనే కోలీవుడ్ డెబ్యూ చేయబోతున్నాడు. కల్ట్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ నిర్మాణం, పర్యవేక్షణలో ఆయన శిష్యుడు మతిమరన్ దర్శకుడిగా రూపొందే మండాడితో తమిళంలో లాంచ్ కాబోతున్నాడు. తెలుగు టైటిల్ యథావిధిగా మనకు అర్థం కాకుండా ఒరిజినల్ వెర్షన్ దే పెట్టారు.

సముద్రపు నేపథ్యంలో రూపొందే మండాడిలో కమెడియన్ సూరి హీరో. సుహాస్ కు తనతో సమాన ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. పోస్టర్లలో ఇదే స్పష్టమవుతోంది. రెండు తెగలకు చెందిన నాయకులుగా సూరి, సుహాస్ నిత్యం కత్తులు దూసుకుంటూ ఉండే బ్యాక్ డ్రాప్ కొత్తగా అనిపిస్తోంది. పడవల మధ్య ప్రాణాంతకమైన పోటీలు పెట్టుకునే తీరప్రాంతాల జీవనం ఆధారంగా ఈ కథ రాసుకున్నట్టు చెన్నై టాక్. సుహాస్ గెటప్ గట్రా చూస్తుంటే వయసు పరంగా కొంచెం పెద్ద బాధ్యత ఇచ్చినట్టు ఉన్నారు. అణుగారిన వర్గాల సమస్యను గొప్పగా చూపించే వెట్రిమారన్ సుహాస్ రూపంలో మరో మంచి ఛాయస్ ఎంచుకున్నాడు.

మండాడి కనక విజయవంతమైతే సుహాస్ కు మరో కెరీర్ దొరికినట్టే. ఎందుకంటే సూరి, విజయ్ సేతుపతి లాంటి డార్క్ టోన్ హీరోలకు అక్కడ బాగా డిమాండ్ ఉంది. సరైన టాలెంట్ ఉంటే చాలు. సుహాస్ కి ఇక్కడ మంచి కథలే పడుతున్నా మార్కెట్ పూర్తి స్థాయిలో పెరగడం లేదు. ఓపెనింగ్స్ ని ఫుల్ చేయలేకపోతున్నాడు. దిల్ రాజు లాంటి నిర్మాత బ్యాకప్ ఉన్నా జనక అయితే గనకతో పనవ్వలేదు. అంతకు ముందు ప్రసన్నవదనం లాంటివి మంచి టాక్ తోనూ నెగ్గలేకపోయాయి. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ ఒకటే కాస్త ఓకే అనిపించుకుంది. మరి కోలీవుడ్ లో మండాడితో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.