మిక్కీ జె మేయర్…. మిస్సయ్యారా ప్లసయ్యారా

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్ మీడియా అభిప్రాయాల్లో కాస్త ఎక్కువ ఫోకస్ అయిన విషయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. నిజానికి ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ ని ఎంచుకోవడం పట్ల ఫ్యాన్స్ తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే హ్యాపీ డేస్, శతమానం భవతి లాంటి ఎమోషల్ ఫ్యామిలీ మూవీస్ తో ఎక్కువ దగ్గరైన ఈ సెన్సిబుల్ సంగీత దర్శకుడు ఓవర్ వయొలెన్స్ ఉన్న హిట్ 3కి ఎంత వరకు న్యాయం చేస్తాడనే అనుమానం జనాల్లో లేకపోలేదు. అందుకే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇలాంటి ఇంటెన్స్ డ్రామాలకు టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పడాలి.

అయితే మిక్కీ జె మేయర్ మీద హిట్ 3 విషయంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తనకిచ్చిన బాధ్యతను వంద శాతం న్యాయం చేకూర్చాడని ఒకరు, లేదు అనిరుద్ తమన్ లాంటి వాళ్ళు అయితే ఇంకా బాగా ఇచ్చేవారని మరొకరు ఇలా చాలా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. ఇవి ఆయన దాకా వెళ్లాయి. ట్విట్టర్ ఎక్స్ వేదికగా సుదీర్ఘంగా ఒక సందేశం పంచుకున్నారు. దర్శకుడు శైలేష్ కొలను కోరినట్టుగా మితిమీరిన శబ్దాలు లేకుండా, సబ్జెక్టు డిమాండ్ చేసిన మేరకు పరిధులు దాటని నేపధ్య సంగీతం ఇచ్చానని, ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణ చూసి చాలా సంతోషంగా ఉందని నెగటివిటీ పట్టించుకోనని చెప్పుకొచ్చారు.

నిజానికి హిట్ 3కి మిక్కీ జె మేయర్ మైనస్ కాలేదు. చెవులు పగిలిపోయే సౌండ్ లేకుండా ఇంటెన్సిటీ తగ్గకుండా ఎలాంటి స్కోర్ కావాలో అలాంటిదే ఇచ్చారు. దర్శకుడు శైలేష్ కొలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. పోలికలు పక్కన పెడితే తనవరకు మిక్కీ బెస్ట్ ఇచ్చాడని కితాబిస్తున్నారు. ఇంకెవరైనా అయ్యుంటే బాగుండేదేమో అని కామెంట్ చేయడం కన్నా ఇచ్చింది బాగుందా లేదా అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరికిపోతుంది. అయితే పాటల విషయంలో మాత్రం మిక్కీ పూర్తి హ్యాపీ చేయలేకపోయారు. అనిరుద్ పాడిన సాంగ్ సైతం ఏమంత గొప్పగా మెప్పించలేకపోయింది.