టాలీవుడ్ హీరోలకు లోకేష్ దొరకడు

టాలీవుడ్ స్టార్ల అభిమానులు తమ హీరోతో జట్టు కడితే బాగుంటుందని ఎదురు చూస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలీతో భారీ సంచలనాలు నమోదు చేసేలా ఉన్నాడు. అయితే లోకేష్ మన ప్రభాస్ లేదా రామ్ చరణ్ ఎవరో ఒకరితో త్వరలో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు జరిగిన  ప్రచారంలో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇవాళ విడుదలైన సూర్య రెట్రో ప్రీమియర్ షోకు హాజరైన లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ కూలి తర్వాత వెంటనే ఖైదీ 2 మొదలుపెట్టబోతున్నట్టు మీడియా ముందు చెప్పేశాడు.

అంతేకాదు నెక్స్ట్ లైన్ లో సూర్యతో రోలెక్స్ ప్లానింగ్ ఉందని కుండబద్దలు కొట్టాడు. అంటే ఈ రెండు పూర్తయి రిలీజయ్యేలోపు ఎంత లేదన్నా 2028 వచ్చేస్తుంది. కమల్ హాసన్ తో విక్రమ్ 2 కూడా చేయొచ్చనే టాక్ ఉంది కానీ దాని గురించి మాత్రం ప్రస్తుతానికి మాట్లాడలేదు. ఒకవేళ హోంబాలె ఫిలింస్ లో ప్రభాస్ – లోకేష్ కనగరాజ్ కాంబో కనక నిజమైతే ఎంత లేదన్నా ఇంకో మూడు సంవత్సరాలు వేచి చూడక తప్పదు. ఇక రామ్ చరణ్ తో ఎలా ఎప్పుడు సాధ్యపడుతుందో అంతు చిక్కదు. ఈ కలయిక కోసం పలువురు అగ్ర నిర్మాతలు ట్రై చేస్తున్నారు కానీ సెట్ కావడం లేదని ఫిలిం నగర్ టాక్.

సో ఇప్పుడప్పుడే జరగని వాటి గురించి డిస్కషన్లు అనవసరం. ఇదిలా ఉండగా లోకేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాసుకున్న సూపర్ హీరో మూవీ ఇరుంబు కైని అమీర్ ఖాన్ తో చేసే ప్రతిపాదన కూడా ఉందట. దానికాయన సానుకూలంగా ఉన్నారు కానీ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాక వచ్చి కలుస్తానని లోకేష్ చెప్పినట్టు వినికిడి. ఈ కారణంగానే కూలిలో అమీర్ ఖాన్ స్పెషల్ రోల్ చేశాడనే ప్రచారం ఉంది. ఖైదీ 2 ఇంకా మొదలవ్వకపోయినా ఫ్యాన్స్ లో దీని మీద మాములు అంచనాలు లేవు. జైల్లో ఉండి వచ్చిన ఢిల్లీ గతాన్ని ఇందులో చూపించబోతున్నారట. కాకపోతే ఖైదీ లాగా ఒక్క రాత్రిలో కాకుండా రోజంతా నడిచే కథగా ఉంటుందట.