ఈ ఏడాది ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడుని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. విడుదల పరంగా విశేషం లేదు కానీ ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మొదటిసారి ఒక పాత సినిమాని ఐమాక్స్ వెర్షన్ లోకి మార్చి దానికి 4కె, డాల్బీ అట్మోస్ తో పాటు సిద్ధం చేయబోతున్నారు. ఇది అరుదైన ఘనత. ఎందుకంటే ఐమాక్స్ తెరకు అనుగుణంగా కన్వర్షన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఏ మాత్రం తేడా వచ్చినా తెరమీద బొమ్మ విచిత్రంగా కనిపిస్తుంది. అందుకే ఒక టెక్నికల్ టీమ్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అవుట్ ఫుట్ చూస్తే మతులు పోవడం ఖాయమట. ఇక్కడో ట్విస్టు ఉంది.
దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఒరిజినల్ ఐమాక్స్ తెర లేదు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఉన్నాయి కానీ మన మూవీ లవర్స్ ఆ అదృష్టానికి నోచుకోలేదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉన్నది పెద్ద తెరే కానీ రెగ్యులర్ గా వాడే బార్కో ప్రొజెక్షనే అందులో ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఐమాక్స్ సంస్థ పంపిణి చేసే ఎక్క్విప్ మెంట్ ఉండదు. అలాంటప్పుడు ఐమాక్స్ అనుభూతి పొందలేం. సూళ్లూరుపేటలో ఉన్న ఆసియ అతి పెద్ద స్క్రీన్ కు సైతం ఇదే సమస్య ఉంది. అయితే ఓవర్సీస్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ ఉంది కనక అక్కడి అభిమానులు అతడుని కొత్తగా ఎక్స్ పీరియన్స్ అవ్వొచ్చు.
ట్రేడ్ టాక్ ప్రకారం ఏడాది ఒప్పందం మీద అతడు రీ రిలీజ్ హక్కులు 3 కోట్లకు విక్రయించినట్టు చెబుతున్నారు. అఫీషియల్ నెంబర్ కాదు కానీ పరిశ్రమ వర్గాల్లో ఈ వార్త జోరుగా వినిపిస్తోంది. మురారి, పోకిరి, ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రికార్డులను డబుల్ మార్జిన్ తో బద్దలు కొడుతుందనే నమ్మకం ఫాన్స్ లో ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అతడులో మణిశర్మ పాటలు, ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన ట్విస్టులు, పార్ధుగా మహేష్ బాబు నటన, త్రిష గ్లామర్ దీన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చాయి. స్టార్ మా ఛానల్లో పదిహేను వందలసార్లు ప్రసారమైన ఏకైక టాలీవుడ్ మూవీగా అతడు పేరు మీద మరో మైలురాయి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates