అపార్థం చేసుకున్న సల్మాన్….అర్థం చెప్పిన నాని

కొన్ని వారాల క్రితం సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తెలుగు, తమిళ ఆడియన్స్ ని ఉద్దేశించి తనను భాయ్ భాయ్ అని పిలుస్తారు కానీ థియేటర్లకు వచ్చి సినిమా చూడటం లేదని కామెంట్ చేయడం హాట్ టాపికయ్యింది. ప్రభాస్, రజనీకాంత్, రామ్ చరణ్, తారక్ లాంటి సౌత్ హీరోల మూవీస్ ని ఉత్తరాది వాళ్ళు ఆదరిస్తుంటే అది తమకు తిరిగి దక్కడం లేదనే రీతిలో మాట్లాడారు. నిజానికి సల్మాన్ చెప్పింది వాస్తవమని చెప్పడానికి లేదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆదరించే పెద్ద మనసు టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా.

దీని గురించి తాజాగా నాని స్పందించాడు. సల్మాన్ కామెంట్స్ ని మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో అంటూనే తనదైన శైలిలో అర్థం చెప్పాడు. హిందీ సినిమాలు దశాబ్దాల నుంచే ఇక్కడ గొప్పగా ఆడాయని, కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి క్లాసిక్స్ ఎన్నో గొప్ప జ్ఞాపకాలను ఇక్కడ అందుకున్నాయని గుర్తు చేశాడు. తనకు హం ఆప్కే హై కౌన్ చాలా ఇష్టమని, దీదీ తేరా దేవర్ దివానా ఇప్పటికీ పెళ్లిళ్లలో వాడుతూ ఉంటారని ఉదాహరణ చెప్పాడు. న్యాచురల్ స్టార్ చెప్పింది అక్షరాలా నిజం. షోలే, నమక్ హలాల్, డాన్ లాంటివి డెబ్భై దశకంలోనే హైదరాబాద్ లో సిల్వర్ జూబ్లీలు ఆడాయి.

అయినా సికందర్, కిసీకా భాయ్ కిసీకా జాన్, ట్యూబ్ లైట్, రాధే లాంటి అత్తెసరు సినిమాలు తీస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు. భజరంగి భాయ్ జాన్ ఇక్కడ కోట్లు వసూలు చేయలేదా. సుల్తాన్ కు ఏపీ తెలంగాణలో మంచి రికార్డులు ఉన్నాయి. జవాన్, పఠాన్ మనమూ ఎగబడి చూశాంగా. యానిమల్ వచ్చింది ఏ భాషలో. ఈ లాజిక్కులన్నీ మర్చిపోయి తన సినిమాలు చూడటం లేదని మొత్తుకుంటే ఎలా. మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఎగబడతారని మలయాళంలో మోహన్ లాల్ నిరూపించడం కళ్ళముందే ఉంది. ఇది గుర్తించి సల్మాన్ కూడా సరైన దారిలో వెళ్తే కలెక్షన్లు రాకపోవడానికి సాకులు వెతికే పని ఉండదు. ఏమంటావ్ భాయ్.