మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన అనుష్క శెట్టి అనుకున్న ప్రకారం అన్నీ జరిగి ఉంటే ఈ ఏప్రిల్ లోనే ఘాటీతో పలకరించేది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ లో జరుగుతున్న ఆలస్యం, పెండింగ్ ఉన్న ప్యాచ్ వర్క్ వల్ల ఇంకా కొత్త డేట్ నిర్ణయించుకోలేదు. మరి ఎప్పుడు విడుదలనేది దర్శకుడు క్రిష్, నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఎక్కడా చెప్పడం లేదు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం అనుష్క మొత్తం రెండు సినిమాల్లో దర్శనమివ్వనుంది. ఘాటీ తర్వాత మలయాళంలో చేసిన విజువల్ గ్రాండియర్ కథనర్ పార్ట్ 1 ఇదే ఏడాది ప్యాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది.
ఇక్కడితో అయిపోలేదు. కథనర్ రెండు భాగాలుగా తీస్తున్నారు. 2026లో సీక్వెల్ వస్తుంది. తొమ్మిదో శతాబ్దానికి చెందిన కడమత్తాత్తు కథనర్ అనే క్రైస్తవ పూజారి కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఇది రూపొందుతోంది. కాళీయన్ కట్టు నీలిగా అనుష్కకు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. ఇదిలా ఉండగా భాగమతి 2 చేయాలనే ప్లానింగ్ లో యువి సంస్థ ఉంది. కాకపోతే స్వీటీ డేట్లు ఎంత వరకు అందుబాటులో ఉంటాయనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోబోతోంది. ఇవి కాకుండా తెలుగులో ఒకటి, తమిళంలో మరొక సినిమాకు అనుష్క సానుకూలంగా స్పందించినట్టు వార్తలు ఉన్న నేపథ్యంలో ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఇదంతా ఎలా ఉన్నా అనుష్క ఇంత గ్యాప్ తీసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్పీడ్ పెంచాలనేది వాళ్ళ డిమాండ్. అన్నట్టు ప్రభాస్ తో ఆమె మరోసారి జోడి కట్టొచ్చని, హోంబాలే సంస్థతో డార్లింగ్ చేసుకున్న మూడు ప్రాజెక్టుల్లో ఒకదానికి స్వీటీనే హీరోయిననే ప్రచారం జరుగుతోంది కానీ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా నమ్మే అవకాశం లేని గాసిప్ ఇది. సినిమాల సంగతి పక్కనపెడితే త్వరలో అనుష్క పెళ్లి జరగాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అభిమతం ఎప్పుడు తీరుతుందో అంతు చిక్కడం లేదు. పుకార్ల వలయంలో వార్తలు చక్కర్లు కొట్టడం మినహాయించి నిజంగా మిసెస్ అనుష్క ఎప్పుడవుతుందో వేచి చూడాలి.