పెహల్గామ్ ఉదంతం తర్వాత పాకిస్థాన్ మీద తీవ్ర చర్యలకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల నుంచి కూడా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా శత్రుదేశం ఆర్టిస్టులు ఎవరైనా ఇక్కడి సినిమాల్లో నటించకుండా ఒకవేళ నటిస్తే వాటిని నిషేధించేలా చర్యలు తీసుకోవాలంటూ పిలుపునిస్తున్న జనాల సంఖ్య పెరుగుతోంది. వాటిలో ఫవద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాల్ మొదటిది. ఇప్పటికే బ్యాన్ ట్రెండింగ్ నడుస్తోంది. ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ తండ్రి కూడా గతంలో పాకిస్థాన్ మిలిటరీలో పని చేశారనే ప్రచారం ఊపందుకోవడంతో ఫౌజీ మీద సైతం వ్యతిరేక గళం మొదలయ్యింది.
దీంతో ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి ఇస్మాయిల్ క్లారిటీ ఇచ్చింది. పెహల్గామ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు సంతాపం ప్రకటించి తన గురించి జరుగుతున్న ప్రచారం పట్ల వివరణ పొందుపరిచింది. తన కుటుంబానికి గతంలో, వర్తమానంలో పాకిస్థాన్ మిలిటరీతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని, కేవలం ద్వేషంతో వీటిని ప్రచారం చేశారని పేర్కొంది. తాను ఇండో అమెరికనని స్పష్టం చేసింది. యూత్ లో ఉన్నప్పుడే తల్లితండ్రులు చట్టప్రకారం అమెరికా వచ్చి సెటిలై అక్కడి పౌరులయ్యారని, లాస్ యాంజిల్స్, క్యాలిఫోర్నియాలో జన్మించిన తాను యూనివర్సిటీ చదువు అక్కడే పూర్తి చేశానని పేర్కొంది.
హిందీ, గుజరాతి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఇమాన్వీ చదువు పూర్తయ్యాక ఢిల్లీ వచ్చి నటి, కొరియోగ్రాఫర్, డాన్సర్ గా కెరీర్ ఎంచుకున్నట్టు పేర్కొంది. తన గురించి ఇలా ప్రచారం చేయడం సబబు కాదని, పేరొందిన కొన్ని మీడియా సంస్థలు సమాచారం పూర్తిగా తెలుసుకుండా కథనాలు వేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఏదైతేనేం ఇమాన్వి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఒక పెద్ద అనుమానం తీరిపోయింది. అయితే అసలు వివాదానికి దారి తీసిన తండ్రి ఉద్యోగం, నేపథ్యం గురించి మాత్రం ఇమాన్వి అందులో పేర్కొనలేదు. మొత్తానికి ఫౌజి హీరోయిన్ గురించి జరుగుతున్న నెగటివ్ పబ్లిసిటీకి చెక్ పడటం మంచి పరిణామం.