మూడేళ్లు కష్టపడితే రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన ఘనత గేమ్ ఛేంజర్ కే దక్కుతుంది. దర్శకుడు శంకర్ ని గుడ్డిగా నమ్మిన హీరోతో పాటు నిర్మాత దిల్ రాజుకి కోలుకోలేని షాక్ తగిలింది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆర్థికంగా ఎస్విసికి ఇంకా పెద్ద ఎదురు దెబ్బ తగిలేది. అయితే గేమ్ ఛేంజర్ కి కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. రిలీజ్ కు ముందు మాట్లాడుతూ శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ కు స్టోరీ ఇవ్వడం కన్నా గొప్ప గౌరవం ఏముంటుందనే తరహాలో కార్తీక్ గొప్పగా చెప్పుకున్నాడు
తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో మే 1 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గేమ్ చేంజర్ ప్రస్తావన వచ్చినప్పుడు మాట మార్చేశారు. తాను కేవలం వన్ లైన్ మాత్రమే ఇచ్చానని, గ్రౌండెడ్ గా ఉండే ఒక ఐఎఎస్ ఆఫీసర్ పాయింట్ తో సబ్జెక్టు ఇస్తే అది చాలా మార్పులకు లోనై, వేరే రచయితలు ఎవరెవరో అందులో భాగమై చివరికి వేరే అవుట్ ఫుట్ వచ్చిందని పేర్కొన్నాడు. అయినా ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో ముందే ఊహించలేం కాబట్టి, బాక్సాఫీస్ జయాపజయాలు మన కంట్రోల్ లో ఉండవనే తరహాలో కార్తీక్ సుబ్బరాజ్ ఒక టైపు నిర్వేదంతో టాపిక్ ని ముగించారు.
మరి ఇది మాట విడుదలకు ముందు ఎందుకు చెప్పలేదన్నది మెగా ఫ్యాన్స్ ప్రశ్న. కథ మొత్తం నాదే అన్న తరహాలో ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు ఫ్లాప్ అయ్యాక మాట మారిస్తే ఎలా అంటున్నారు. గేమ్ ఛేంజర్ మొత్తం శంకర్ కనుసన్నల్లోనే జరిగిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే ఒక దశలో ఆయన దిల్ రాజుతో సహా ఎవరి మాటా వినలేదనే టాక్ కూడా వచ్చింది. అలాంటప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పటికప్పుడు దాని గురించి తెలుసుకునే అవకాశం దొరికి ఉండకపోవచ్చు. సరే ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో పక్కన పెడితే కెరీర్ పరంగా చివరికి నష్టపోయింది రామ్ చరణే అన్నది అభిమానుల నుంచి వస్తున్న కామెంట్.