సితారే జమీన్ పర్.. ఈసారి కన్నీళ్లు కాదు

ఆమిర్ ఖాన్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ ఆయన సినిమాల్లో ‘తారే జమీన్ పర్’ చాలా స్పెషల్. నటుడిగా మాత్రమే కాక దర్శకుడిగానూ తనదైన ముద్ర వేసిన సినిమా అది. ఆమిర్ డైరెక్ట్ చేసిన ఏకైక చిత్రమిది. తొలి చిత్రమే అయినా.. భావోద్వేగాలను అద్భుతంగా పండించి మెప్పించాడు. ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పతాక సన్నివేశాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటిగా ‘తారే జమీన్ పర్’ గుర్తింపు తెచ్చుకుంది. ఆమిర్ హీరోగా పీక్స్‌లో ఉండగా ఈ సినిమా తీసి దర్శకుడిగా కూడా గొప్ప పేరు సంపాదించాడు.

ఐతే ఇప్పుడు హీరోగా ఎన్నడూ లేని స్లంప్ చూస్తున్న దశలో ఆమిర్ మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ‘తారే జమీన్ పర్’కు కొనసాగింపుగా ‘సితారే జమీన్ పర్’ తీస్తున్నాడు. ఈ సినిమా గురించి తొలిసారి ఓపెన్ అయ్యాడు ఆమిర్. ‘తారే జమీన్ పర్’ లాగా ఇది ఎమోషనల్ సినిమా కాదని ఆమిర్ చెప్పడం విశేషం. ఆ సినిమాలో ప్రేక్షకులను ఏడిపించామని.. ఈ సినిమాలో నవ్వించడమే ప్రధాన లక్ష్యమని ఆమిర్ తెలిపాడు.

‘‘సితారే జమీన్ పర్ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ కథ దివ్యాంగుల నేపథ్యంలో నడుస్తుంది. ‘తారే జమీన్ పర్’ మిమ్మల్ని ఏడిపించింది. కానీ ‘సితారే జమీన్ పర్’ నవ్విస్తుంది. తొలి చిత్రంలో నేను సున్నితమైన భావాలున్న వ్యక్తిగా నటించాను. కానీ ఇందులో నా పాత్ర భిన్నంగా, పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. నా పాత్ర రాజకీయ నాయకులతో దురుసుగా ప్రవర్తిస్తుంది. కుటుంబ సభ్యులతోనూ గొడవపడి అవమానిస్తుంటుంది. ఎన్నో అంతర్గత సమస్యలతో బాధ పడే వ్యక్తి మంచివాడిగా ఎలా మారాడాన్నదే ఈ కథ’’ అని ఆమిర్ తెలిపాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘సితారే జమీన్ పర్’ విడుదలవుతుంది.