మే 1 విడుదలవుతున్న రెండు సినిమాలు హిట్ 3 ది థర్డ్ కేస్, రెట్రో దేనికవే ప్రత్యేక అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అయితే ప్రమోషన్ల పరంగా తీసుకుంటున్న శ్రద్ధ నానిని ముందువరసలో నిలబెట్టి ఆధిపత్యం చేయిస్తున్న వైనం స్ఫష్టంగా కనిపిస్తోంది. నాని ముందు హైదరాబాద్ లో మీడియా ఇంటర్వ్యూలు పూర్తి చేశాడు. ముంబైకి వెళ్లి అక్కడ ముఖాముఖీలు చేస్తున్న టైంలోనే టాలీవుడ్ జర్నలిస్టులకు ఇచ్చిన వీడియో కంటెంట్ లైవ్ లోకి వచ్చేలా చూసుకున్నాడు. దీని ద్వారా ఒకే సమయంలో అటు నేషనల్, ఇటు లోకల్ రెండు చోట్లా నానినే కనిపించేలా వేసుకున్న స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌటయ్యింది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటే పెండింగ్ ఉంది. చేతిలో ఉన్నది ఏడు రోజులే. ఈ వారంలోనే వేడుకను చేయబోతున్నారు. పబ్లిసిటీలో అది చివరి ఘట్టం కాబట్టి నాని దాన్ని స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడని టాక్. ట్రైలర్ కు యునానిమస్ రెస్పాన్స్ కనిపించనప్పటికీ స్టోరీ రివీల్ కాకూడదనే ఉద్దేశంతో దర్శకుడు శైలేష్ కొలను తీసుకున్న జాగ్రత్తలకు ఎంత వరకు న్యాయం జరిగిందో థియేటర్లలో తెలుస్తుంది. హిట్ 3తో పోలిస్తే రెట్రో వెనుకబడిన మాట వాస్తవం. సితార డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ లో అంచనాలు రేపడంలో వెనుకబడే ఉంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హిట్ 3కు ముందో వెనుకో జరగనుంది.
రెట్రోకు వచ్చిన అతి పెద్ద సమస్య వెరైటీ ట్రైలర్ కట్. మాస్ కి అదేంటో సరిగ్గా అర్థం కాలేదు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి సైతం వాళ్ళ డీకోడింగ్ లో కథేంటో అర్థమైపోయి ఆ కోణంలో కొత్తదనం ఆశించడం లేదు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఏదైనా మేజిక్ చేస్తాడని ఎదురు చూస్తున్నారు. తమిళంలో పర్వాలేదు కానీ తెలుగులో రెట్రోకి ముందస్తు హైప్ అంతగా లేకపోవడం కనిపిస్తోంది. గత డిజాస్టర్ కంగువ ప్రభావాన్ని కొట్టి పారేయలేం. ఉన్నంతలో పూజా హెగ్డే వల్ల రెట్రో టాపిక్ సోషల్ మీడియాలో ఎక్కువ తిరుగుతోంది. మరి మే 1 క్లాష్ లో ఎవరిది పై చేయి అవుతుందో, ఎవరు వసూళ్ల వర్షం కురిపిస్తారో లెట్ వెయిట్ అండ్ సీ.