హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది. ప్రకటించిన కొన్ని నెలలకే షూట్ కూడా మొదలుపెట్టారు. రెండు భాగాలుగా అనుకున్న ఈ చిత్రంలో పార్ట్-1 కూడా పూర్తి కాలేదు. పలుమార్లు షూటింగ్‌కు బ్రేక్ పడింది. మధ్యలో దర్శకుడు కూడా మారాడు. కానీ ఎంతకీ సినిమా విడుదలకు సిద్ధం కావట్లేదు. చివరగా మే 9న రిలీజ్ అన్నారు. కానీ ఆ డేట్ దగ్గర పడుతోంది. సినిమా ఆ రోజు రిలీజయ్యే అవకాశమే కనిపించడం లేదు. ఇంకా ఒక కీలక షెడ్యూల్ చిత్రీకరణ మిగిలి ఉంది. దానికి పవన్ డేట్లు కేటాయించకపోవడంతో సినిమాను వాయిదా వేయడం అనివార్యమైంది.
మళ్లీ వాయిదా అనేసరికి.. ఇప్పుడిప్పుడే సినిమా రిలీజ్ కాదని పవన్ అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. కానీ ఇంతలో మళ్లీ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తాజా సమాచారం. ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ కాల్ షీట్స్ కేటాయించాడట. మేలో ఇంకొన్ని రోజుల్లోనే పవన్ షూట్‌కు హాజరు కానున్నాడట. ఆయనో పది రోజులు వరుసగా చిత్రీకరణకు వస్తే బ్యాలెన్స్ షూట్ అంతా అయిపోతుంది. ఐతే పవన్ వచ్చే వరకు ఏదీ గ్యారెంటీ లేదు కాబట్టి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడం లాంటిదేమీ చేయట్లేదు చిత్ర బృందం.
పవన్ చిత్రీకరణకు హాజరై గుమ్మడికాయ కొట్టాకే కొత్త డేట్ అనౌన్స్ చేస్తారట. అంతా అనుకున్నట్లుగా జరిగితే మే నెలాఖరులో లేదా జూన్ ప్రథమార్ధంలో ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందట. మరోవైపు తన కోసం ఎదురు చూస్తున్న ‘ఓజీ’ టీంకు కూడా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. వీలు చేసుకుని ఆ సినిమా చిత్రీకరణకు కూడా హాజరవుతానని.. రెడీగా ఉండాలని మేకర్స్ కు పవన్ సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం ఇప్పుడిప్పుడే పున:ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates