పీక్ సమ్మర్లో థియేటర్లు జనాల్లేక వెలవెలబోతుండడం పట్ల టాలీవుడ్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. వేరే ఇండస్ట్రీల పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. అన్ని చోట్లా థియేటర్లు ఖాళీగానే ఉంటున్నాయి. వాటిని కళకళలాడించే సినిమాల కోసం ఎదురు చూస్తున్నాయి ఇండస్ట్రీలు. టాలీవుడ్ విషయానికి వస్తే.. గత వీకెండ్లో రిలీజైన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, ‘ఓదెల-2’ వీకెండ్ వరకు కొంచెం సందడి చేసి ఆ తర్వాత పడుకున్నాయి. ఈ వారం రాబోతున్న సారంగపాణి జాతకం, చౌర్యపాఠం చిన్న సినిమాలు. వాటి మీద మరీ అంచనాలు లేవు. టాక్‌ను బట్టి ఆడేలా ఉన్నాయి.
ఐతే తర్వాతి వారంలో మాత్రం బాక్సాఫీస్‌లో ఆశలు రేపే సినిమా వస్తోంది. నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘హిట్-3’ రిలీజయ్యేది మే 1నే. ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. టాక్ బాగుంటే నాని కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కావచ్చు. హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవొచ్చు. సమ్మర్లో స్లంప్ చూస్తున్న టాలీవుడ్.. ఈ సినిమా మీద ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు ఈ సినిమా మీద చాలా ఆశలతో ఉన్నారు.
ఇక తమిళంలో కూడా మే 1న రిలీజయ్యే ‘రెట్రో’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. చాలా ఏళ్లుగా సరైన విజయాలు లేని సూర్యకు ఇది పెద్ద కమ్ బ్యాక్ కాగలదని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజవుతోంది. మరోవైపు హిందీ పరిశ్రమ అజయ్ దేవగణ్ మూవీ ‘రైడ్-2’ మీద ఆశలతో ఉంది. ‘రైడ్’ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దాని సీక్వెల్ కూడా అలాగే ఆడి బాలీవుడ్‌కు జోష్ తెస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే మే 1న రాబోయే మూడు చిత్రాలు దేశంలోని మూడు ప్రధాన ఫిలిం ఇండస్ట్రీలకు ఎంతో కీలకంగా మారనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates