ఇటీవలే జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తనతో సమాంతరంగా కెరీర్ నడిపించిన మరో నటిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్ లో వైరల్ గా మారాయి. ఆమెకు తాను ఒకేసారి మెసేజ్ చేశానని, ఒక సినిమాలో పెర్ఫార్మన్స్ మెచ్చుకుంటూనే ఇలాంటివి ఎందుకు ఎంచుకుంటున్నావని అడిగితే ఆంటీ పాత్రల కంటే ఇవే నయమనే తరహాలో కౌంటర్ వేసిందని చెప్పుకొచ్చింది. అయితే డబ్బా రోల్స్ కంటే ఆంటీగా అత్తగా కనిపించడమే నయమంటూ పబ్లిక్ స్టేజి మీద సిమ్రాన్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాకయ్యారు. ఆవిడ ఎవరిని ఉద్దేశించి అన్నదా అనే చర్చల్లో మునిగితేలారు.
కొందరు జ్యోతిక అనుకున్నారు. డబ్బా కార్టెల్ లో చేసింది కాబట్టి అలా అన్వయించుకున్నారన్న మాట. ప్రాధాన్యం తక్కువే కానీ అందులో మరీ అంత తీసిపారేసే పాత్ర కాదనేది ఫ్యాన్స్ ఉద్దేశం. ఇంకొందరు లైలాని ప్రస్తావిస్తున్నారు. ఆది పినిశెట్టి శబ్దంలో తనకే మాత్రం సూటవ్వని నెగటివ్ షేడ్స్ లో కనిపించింది. సినిమా కూడా ఫ్లాప్. అయితే ఇదే సినిమాలో సిమ్రాన్ కూడా ఉందనే విషయం మర్చిపోకూడదు. కాకపోతే కాంబినేషన్ సీన్లు ఉండవు. ఇంకో వర్గం స్నేహ గురించని మరో అనాలిసిస్ తీశారు. కానీ ఆమె మునుపటిలా యాక్టివ్ గా లేదు. అంజలి అని మరొకరు గేమ్ ఛేంజర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు.
రాసుకుంటూ పోతే లిస్టు పెద్దదే కానీ సిమ్రాన్ అన్నది ఎవరినో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. వీడియో క్లిప్ మాములుగా వైరల్ కాలేదు. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న సిమ్రాన్ ఇటీవలి కాలంలో చాలా బిజీ అయ్యింది. అత్త, అమ్మగా నటించేందుకు మొహమాట పడటం లేదు. ఆ మాటకొస్తే సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో ఫామ్ లో ఉన్నప్పుడే సూర్య తల్లిగా నటించడం గుర్తే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో తళుక్కున మెరిసింది. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ అందుకున్న సిమ్రాన్ తెలుగులో కనిపించడం తగ్గించేసింది కానీ తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates