విశ్వంభర విఎఫెక్స్….తగ్గేదేలే !

ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పైకి తీసుకెళ్లలేకపోయిన విశ్వంభర కోసం తెర వెనుక చాలా పెద్ద కసరత్తే జరుగుతోంది. యూనిట్ వదులుతున్న సమాచారం మేరకు కేవలం విఎఫ్ఎక్స్ కే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టడం చిరంజీవి సినిమాకు ఇదే మొదటిసారి కానుంది. పలు విదేశీ నిపుణులు దీని కోసమే పని చేస్తున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు వశిష్ఠ అనుకున్న విజన్ కి టీజర్ లో చూపించిన విజువల్స్ కి మధ్య చాలా తేడా రావడంతో రిపేర్ల గురించి మెగాస్టార్ చాలా సీరియస్ సూచనలు చేశారట. దానికి అనుగుణంగానే ఒకటికి పదిసార్లు క్వాలిటీ చెకింగ్ తో ఆలస్యమవుతున్నా తగ్గేదేలే అంటున్నారట.

బజ్ పరంగా వెనుకబడిన విశ్వంభరకు సాలిడ్ ప్రమోషన్లు అవసరం కాబోతున్నాయి. ముందుగా విడుదల తేదీ ఖరారు చేయాలి. జూలై 24 అనే ప్రచారం జోరుగా జరుగుతోంది కానీ యువి క్రియేషన్స్ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకోవైపు ఇతర సినిమాలు డేట్లను ఒక్కొక్కటిగా లాక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. భోళా శంకర్ తర్వాత సుమారు రెండేళ్ల గ్యాప్ తో వస్తున్న చిరు మూవీ ఇది. అందుకే ప్రకటన టైంలో అభిమానులు ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ బిజినెస్, ఓటిటి పరంగానూ ఇబ్బందిగా మారుతోంది. ఇప్పుడవన్నీ సరిచేస్తున్నారు.

బయట హైప్ సంగతి ఎలా ఉన్నా విశ్వంభరలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వస్తున్నాయని టీమ్ లో వినిపిస్తున్న మాట. మొత్తం ఫైనల్ చెక్ అయ్యాక ట్రైలర్ కట్ ని ప్లాన్ చేస్తారట. ఎలాంటి తొందరపాటు లేకుండా బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ వశిష్టతో పాటు చిరుకి బాగా సన్నిహితంగా ఉండే పలువురు టాలీవుడ్ సీనియర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారనే టాక్ గతంలోనే వచ్చింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకు కీరవాణి అందిస్తున్న సంగీతం నుంచి పెద్ద మేజిక్ ఆశిస్తున్నారు మ్యూజిక్ లవర్స్. రామ రామ పాట పర్వాలేదనిపించింది. రెండో సాంగ్ వచ్చే నెల వదులుతారు.