షైన్ టామ్ చాకో.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ‘దసరా’ చిత్రంలో అతడి పాత్ర, నటన మనవాళ్లకు విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సహా పలు చిత్రాల్లో నటించి తెలుగులో బాగా పాపులర్ అయ్యాడతను. పాత్ర ఎలాంటిదైనా ఒక నటుడిని చూడగానే ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ కలగడం అందరి విషయంలో జరగదు. ఈ ప్రత్యేకత టామ్ చాకో లాంటి విలక్షణ నటులకే సొంతం. కెరీర్ ఆరంభంలో ప్రకాష్ రాజ్ సైతం ఇలాంటి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఐతే టామ్‌లో టాలెంట్‌కు కొదవ లేదు. సైకో క్యారెక్టర్లను పండించడంలో అతడి నైపుణ్యమే వేరు.
స్వతహాగా మలయాళ నటుడైనప్పటికీ ఇప్పుడు తెలుగు, తమిళంలో బోలెడన్ని అవకాశాలు అతడి చేతిలో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని నటుడిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం షైన్‌కు ఉంది. కానీ అతడికి అలాంటి ఉద్దేశాలేమీ ఉన్నట్లు కనిపించడం లేదు. తెర మీదే తాను చేసే పాత్రల తరహాలోనే నిజ జీవితంలో కొంచెం తేడా అనే పేరు టామ్‌కు మొదట్నుంచి ఉంది. సహచర ఆర్టిస్టులతో తప్పుగా ప్రవర్తించడం.. స్టేజ్ మీద అతి చేయడం.. ఇంటర్వ్యూల్లో హద్దులు మీరి ప్రవర్తించడం.. ఇలా అతడితో ముడిపడ్డ వివాదాలు ఎన్నో.
ఇవన్నీ చాలవన్నట్లు డ్రగ్స్‌తో ముడిపడి తన పేరు పలుమార్లు వివాదాల్లోకెక్కింది. సినిమా సెట్స్‌లో డ్రగ్స్ సేవించినట్లు కూడా తనపై ఆరోపణలున్నాయి. తాజాగా అతను ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటుండగా.. పోలీసులు రైడ్ చేయడం, అతను హడావుడిగా పారిపోవడం.. సదరు వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో షైన్ పేరు మార్మోగుతోంది. ఇంత మంచి నటుడికి ఈ వంకర బుద్ధులేంటి.. ఎప్పుడూ మీడియా ఫోకస్ ఉంటుందని తెలిసీ ఈ విపరీత ప్రవర్తన ఏంటి.. డ్రగ్స్ గురించి యువతను మేల్కొల్పాల్సిన స్థితిలో ఉండి ఇవేం పనులు అంటూ అతడి మీద మండిపడుతున్నారు నెటిజన్లు.