ప్రోమోలు అదిరినా.. బుకింగ్స్ డల్లే

వేసవి అంటే ఒకప్పుడు భారీ చిత్రాలు, కలెక్షన్ల జాతరతో బాక్సాఫీస్ కళకళలాడిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జనాలకు ఐపీఎల్ సహా వినోద మార్గాలు పెరిగిపోయి, ఆసక్తికర సినిమాలు అందుబాటులో లేక థియేటర్ల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. అప్పుడప్పుడూ ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నా సరే.. బాక్సాఫీస్ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ వారం రెండు క్రేజీ మూవీస్ రిలీజవుతున్నాయి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల-2.. ఈ రెండు చిత్రాలూ టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్నాయి. ప్రామిసింగ్‌గా కనిపించాయి.

సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాలు బాగానే ట్రెండ్ అయ్యాయి. వీటికి బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఐతే తీరా రిలీజ్ టైం దగ్గరపడేసరికి బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. ఈ రోజు రిలీజవుతున్న ‘ఓదెల-2’కు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూస్తే పచ్చతోరణాలే కనిపిస్తున్నాయి. హౌస్ ఫుల్స్ సంగతి పక్కన పెడితే.. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలే కనిపించడం లేదు. డబుల్ డిజిట్ టికెట్లు తెగిన థియేటర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.

ఇక శుక్రవారం రిలీజవతుున్న కళ్యాణ్ రామ్ సినిమా పరిస్థితి కొంచెం బెటరే కానీ.. దానికి కూడా బుకింగ్స్ మరీ ఆశాజనకంగా ఏమీ కనిపించడం లేదు. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు చాలా తక్కువగా ఉన్నాయి. అది మాంచి మాస్ సినిమాలా కనిపిస్తున్నా సరే.. బుకింగ్స్ డల్లుగానే ఉన్నాయి. యూత్ అంతా ఐపీఎల్ మాయలో ఉండడం ప్రధానంగా సినిమాలకు మైనస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలకు ఇప్పుడు టాక్ కీలకంగా మారింది. ‘చాలా బాగుంది’ అనే టాక్ వస్తేనే జనం థియేటర్లకు కదిలేలా ఉన్నారు. మరి ఈ రోజు, రేపు ఉదయం మార్నింగ్ షోల తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి.