సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న వెంకటేష్ ఆ తర్వాత ఎవరితో చేయాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా ఉండొచ్చనే ప్రచారం నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది కానీ వాస్తవానికి అలాంటి ప్రతిపాదనేది లేదట. అట్లీతో చేస్తున్న అల్లు అర్జున్ 22 టైం ఎంత ఆలస్యమైనా అప్పటిదాకా వేచి ఉండాలని త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. వీలైతే రెండు సమాంతరంగా షూట్ చేసే సాధ్యాసాధ్యాలను బన్నీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. సో వెంకీ, మాటల మాంత్రికుడి కాంబో లేనట్టే.
ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ ని ఒప్పించడం దర్శకులకు మహా కష్టంగా మారిందట. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సక్సెస్ ని పెంచుకునే దిశగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సామాజవరగమన రచయితల్లో ఒకరైన నందు చెప్పిన కథ నచ్చింది కానీ దాని బాధ్యతలు తీసుకునే దర్శకుడిని సెట్ చేయడం సవాల్ గా మారిందట. చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఎంటర్ టైనర్ లో వెంకటేష్ ఉన్నారనే వార్తకు సంబంధింది సరైన క్లారిటీ రాలేదు. ఉన్నా ఎంత నిడివి అనేది సస్పెన్స్ గా ఉంది.
మిగిలిన సీనియర్ హీరోల్లా వేగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్న వెంకటేష్ మూడు నెలలుగా స్టోరీ డిస్కషన్స్ లో తరచుగా పాల్గొంటున్నారు కానీ ఏదీ తేల్చడం లేదు. మధ్యలో కొంత అనారోగ్యం ఇబ్బంది పెట్టినా వేగంగా కోలుకుని తిరిగి పనుల మీద దృష్టి పెట్టారు. రానా నాయుడు 2 షూట్ చివరి దశలో ఉంది. త్వరలోనే డబ్బింగ్ పూర్తి చేయబోతున్నారు. స్ట్రీమింగ్ డేట్ ఇంకా నిర్ణయించలేదు కానీ ఈ వేసవిలోనే ఉండొచ్చు. ఇమేజ్ ప్లస్ గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి బూతుల డోస్ బాగా తగ్గించారట. ఇదంతా ఓకే కానీ వెంకీని మెప్పించే లక్కీ దర్శకుడు ఎవరో.